టీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌ను ప్రచారంతో ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఎలాంటి సందర్భం వచ్చినా వదిలి పెట్టాలనుకోవడం లేదు. తాజాగా మహిళా దినోత్సవం రాబోతోందని అంచనా వేసి… కేసీఆర్‌ను మహిళా బంధు చేయాలని డిసైడైపోయారు. వెంటనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ క్యాడర్‌తో సమావేశం పెట్టి మూడు రోజుల కార్యక్రమాలు ప్రకటించేశారు.
కేటీఆర్ చెప్పినప్రకారం ఆరో తేదీన కేసిఆర్‌కు రాఖీ కట్టాలి. కటౌట్లకైనా కట్టొచ్చు. ఆ రోజున పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవ సన్మానం చేస్తారు. కెసిఆర్ కిట్, షాదీ ముబారక్ . థాంక్యూ కెసిఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏడో తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలు అయిన కల్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా ఇంటివద్ద కెళ్లి కలిసి సెల్ఫీలు తీసుకోవాలి. ఇక ఎనిమిదో నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, సంబురాలు నిర్వహిస్తారు.
కల్యాణ లక్ష్మి ద్వారాపది లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ పెళ్లి చేశారని..పదకొండు లక్షల మందికి కేటీఆర్ కిట్ ఇచ్చారని..అలాగే మరెన్నో అధ్భుతమైన పథకాలు మహిళల కోసం పెట్టారని టీఆర్ఎస్ చెబుతోంది. అందుకే మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు కేసీఆర్‌ను మహిళా బంధుగా కీర్తించనున్నారు. టీఆర్ఎస్ ప్రచార విభాగంలో ట్విట్టర్ ట్రెండింగ్ ఎలాగూఉంటుంది.. అదికూడా మహిళా దినోత్సవం రోజున జరిగే అవకాశం ఉంది.