స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరగనుంది. అయితే టీఆర్ఎస్లో ఇప్పటికే పోస్ట్ మార్టం ప్రారంభమయింది. అన్నిచోట్ల సంపూర్ణమైన ఆధిక్యం ఉన్న టీఆర్ఎస్కు గెలుపు కోసం టెన్షన్ పడాల్సి వచ్చింది. క్యాంపులు పెట్టాల్సి వచ్చింది. అయినా క్రాస్ ఓటింగ్ జరిగిందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయానికి వచ్చారు. ఖమ్మం జిల్లాలో పార్టీకి చెందిన నేతలే అధికారిక అభ్యర్థిని కాదని ప్రత్యర్థికి ఓటు వేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
అక్కడ పార్టీకి సొంతంగా ఉన్న ఓట్లకంటే తక్కువగా పోలైనట్లుగా ఓ అభిప్రాయానికి వచ్చారు. కరీంనగర్, ఆదిలాబాద్ వంటి చోట్ల కూడా ఓట్లు తక్కువ పడ్డాయని భావిస్తున్నారు. కొన్ని చోట్ల ద్వితీయ శ్రేణి నేతలు నేరుగానే పార్టీ ఆదేశాలను ధిక్కరించారు. పార్టీ నాయత్వం పట్ల అసంతృప్తితో ఉన్న కొద్దిమంది క్రాస్ ఓటింగ్‌కు భయపడలేదని భావిస్తున్నారు. కౌంటింగ్ తర్వాత టీఆర్ఎస్ ఎవరెవరు పార్టీని ధిక్కరించారన్నదానిపై లెక్కలు తీసి అందర్నీ బహిష్కరించేయాలన్న ఉద్దేశంతో ఉంది.
ఇప్పటికే ఈ అంశంపై పార్టీ సీనియర్ నేతలు దృష్టి పెట్టారు. క్రమశిక్షణా రాహిత్యాన్ని సహిస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి అది చేయిదాటిపోయే పరిస్థితి ఉంటుందన్నది కేసీఆర్ భావన. ఫలితాల తర్వాత దానిపై మరింత స్పష్టత వస్తుందని, అప్పుడే పార్టీపరంగా క్రమశిక్షణా చర్యలపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకౌంటింగ్ తర్వాత టీఆర్ఎస్లో కీలక పరిణామాలు ఉంటాయని భావిస్తున్నారు.