2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో.. డొనాల్డ్ ట్రంప్‌కు… హిల్లరీ క్లింటన్‌కు మధ్య పోటీ. డొనాల్డ్ ట్రంప్ బ్యాక్‌గ్రౌండ్ చూసి.. ఆయనకు అసలు ప్రెసిడిన్షియల్ అభ్యర్థిగా అర్హతే లేదనుకున్నారు. సర్వేల్లోనూ అదే తేలింది. కానీ.. అనూహ్యంగా ఆయన విజయం సాధించారు. ఇప్పుడు కూడా.. సర్వేల్లో ఆయన వెనుకబడే ఉన్నారు. కానీ ట్రంప్‌లో ఎలాంటి చీకూచింతా లేదు. నాలుగేళ్ల క్రితం ఆయనలో ఉన్న ఉత్సాహం ఇప్పుడూ కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు జరిగిన రిపబ్లికన్ కన్వెన్షన్‌కు కుటుంబ సమేతంగా హాజరైన ట్రంప్.. వచ్చే నాలుగేళ్లు ఏం చేస్తానో కూడా చెప్పారు.
అమెరికా అమెరికన్లకే.. మేక్ అమెరికా గ్రెట్ ఎగైన్… లాంటి నినాదాలతో గత ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. ఇప్పుడు కూడా అదే ఆలోచనా విధానాన్ని కొనసాగిస్తూ నినాదాల్లో కొంత మార్పు తీసుకొచ్చారు. సురక్షితమైన, శక్తిమంతమైన, గతంకంటే గొప్పగా ఉండే అమెరికాను ప్రజల ముందు ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తానంటున్నారు. ట్రంప్‌కు ప్రజల్లో ఆదరణ ఎంత ఉందో తెలియదు కానీ.. ఆయన మాత్రం చైనాను బూచిగా చూపించి.. గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. చైనా పట్ల కఠినమైన వైఖరి పాటించి తీరుతామని చెబుతున్నారు. ఒక వేళ తాను గెలవకపోతే.. అమెరికా.. చైనా చేతుల్లో చిక్కుకుంటుందని ప్రజల్ని భయపెడుతున్నారు.
ట్రంప్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. తన పాలనలో మచ్చగా మిగిలిపోయిన వాటిని ఆయన ప్రస్తావించడం లేదు. జాత్యాహంకార దాడుల గురించి చెప్పడం లేదు. నల్ల జాతీయులకు భద్రత ఎలా కల్పిస్తారో చెప్పడం లేదు. ప్రజల ఆదాయాలు పెరిగేందుకు ఏం చేస్తారో కూడాచెప్పడం లేదు. డెమొక్రటిక్ కన్వెన్షన్‌లో బైడెన్ ప్రసంగం ఆకట్టుకునేదిగా ఉంటే… ట్రంప్ బోర్ కొట్టించారని మీడియాలో రివ్యూలు వచ్చాయి. సర్వేల్లో బైడెన్ ముందున్నారు. కానీ తాను గెలిచి తీరుతానని ట్రంప్ అంటున్నారు. గెలవకపోతే.. ఆ ఫలితాల్ని ఆమోదించబోనని కూడా చెబుతున్నారు. మొదటిసారి పోటీ చేసినప్పుడు కూడా ఇంతే చెప్పారు.