తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది ప్రభుత్వం. డిసెంబర్ లో ఈ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. డీఎస్సీ కారణంగా గ్రూప్ 2 ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తు ఈ నిర్ణయం తీసుకుంది . జులై 18వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలు పూర్తి అయిన రెండ్రోజుల్లోనే గ్రూప్-2 పరీక్షలున్నాయి. దీంతో ఒకేసారి పరీక్షలు పెడితే తాము ఎలా ప్రిపేర్ అవుతామని, వెంటనే గ్రూప్ 2 ను వాయిదా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు.
డిగ్రీ పూర్తి చేసిన లక్షలాది మంది గ్రూప్ 2 కు ప్రిపేర్ అవుతున్నారు. వారిలో డీఎస్సీకి ప్రిపేర్ అవుతోన్న వారు కూడా ఉండటంతో రెండు రోజుల వ్యవధిలోనే డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలను ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆగస్ట్ 7,8తేదీలలో గ్రూప్ 2 ను నిర్వహించడం వలన డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు.. ఈ గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యేందుకు సమయం కూడా ఉండదని కొద్ది రోజులుగా ఆందోళనలు చేపడుతూ వచ్చారు. అలాగే ,గ్రూప్ 2లో పోస్టులను కూడా పెంచాలన్నారు.
ఈ విషయంపై తాజాగా చర్చించిన ప్రభుత్వం గ్రూప్ 2ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారు అన్నది త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే, నిరుద్యోగులు కోరినట్లుగా పోస్టులను పెంచి పరీక్షలను నిర్వహిస్తారా..?అనే విషయంపై కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.