చంపుతా అన్నోడి చంకనెక్కి, నట్టు… తమ పార్టీని నిట్ట నిలువునా చీల్చి, ఎందరో నేతల్ని లాగేసుకుని, తమ అధినేత తట్టా బుట్టా సర్ధుకుని స్వంతింటికి పారిపోయేలా చేసిన నాయకుడి ప్రాపకం కోసం పాకులాడుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చివరకు దక్కేది ఏమిటి? కనీసం వారు ఆశిస్తున్న ఫలితం అయినా లభిస్తుందా? పార్టీ పరువు పోగొట్టుకుని మరీ వేస్తున్న ఈ చివరి ఎత్తుగడ… తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మిగులుస్తుందా? లేక గత చరిత్రకు ఆనవాలుగా మార్చేస్తుందా?
గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును సరిగ్గా విశ్లేషిస్తే తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును మించిన ప్రత్యర్ధి కనిపించరు. మంత్రి పదవి దక్కలేదనే కోపంతో పార్టీ నుంచి బయటకి వచ్చింది మొదలు… కెసిఆర్ అనే వ్యక్తి మహా శక్తిగా ఎదిగిన క్రమం… తాను ఎదిగేందుకు ఊతమిచ్చిన పార్టీనే ముప్పుతిప్పలు పెట్టిన క్రమం అవగతమవుతుంది. ఇప్పుడు చివరకి అదే పార్టీ తన ప్రాపకం కోసం పాకులాడేలా చేసుకున్నవైనం కనిపిస్తోంది.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బతికి బట్టకట్టాలంటే కెసిఆర్ తో పొత్తు ఒకటే మార్గమని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే పదో పరకో సీట్లు కెసిఆర్ పడేస్తారని, తద్వారా ముందు రాష్ట్రంలో పార్టీ ఉనికి అయినా ఉంటుందని ఆశిస్తోంది. ఈ దింపుడు కళ్లం ఆశతో… రేవంత్‌రెడ్డి లాంటి లీడర్లను సైతం పోగొట్టుకోవడానికి తెగిస్తోంది. సరే… ఒక రాజకీయపార్టీ అన్నాక… సంక్షోభాలు తప్పవు. వాటిని ఎదుర్కోకా తప్పదు. దీని కోసం ఎలాంటి పొత్తులైనా ఎత్తులైనా వేయక తప్పదు. అదే క్రమంలో టీటీడీపీ వేస్తున్న ఈ ఎత్తు ఎంత వరకూ దాని ఆశల్ని నిలబెడుతుంది? దీని మీద ఒక ఊహాజనిత విశ్లేషణ చేద్దాం…
ప్రస్తుతం అందరూ భావిస్తున్నట్టు రేవంత్ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయాడు. తనతో పాటు డజనో, అరడజనో నేతల్ని వెంటబెట్టుకుపోయాడు. కాంగ్రెస్ అనే వేదిక ద్వారా కెసిఆర్ పై పోరాటం చేస్తున్నాడు. ఇక అప్పుడు తెరాస ప్రత్యర్ధి ఎవరు? ఇప్పటికే భాజాపాతో కెసిఆర్ చేస్తున్న ఢిల్లీ స్థాయి దోస్తీ… తెలంగాణలో భాజాపా శ్రేణుల కుస్తీని కామెడీగా మార్చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో…కాంగ్రెస్ మాత్రమే తెరాసకు ఏకైక ప్రత్యర్ధి కావడం తధ్యం. మరోవైపు తెలంగాణలో రేవంత్ లాంటి లీడర్లు పార్టీ మారతున్నారని తెలుస్తుండగానే కొడంగల్‌లో ఆయన అనుచరుల్ని తెరాస లాగేసింది. ఇది తర్వాత కూడా కొనసాగుతుందనడంలో సందేహం లేదు. పైగా… ఏడాదిన్నర ముందుగానే తెరాసతో పొత్తుకు తమ పార్టీ వెంపర్లాటను గమనించాక కూడా ఎంత మంది కార్యకర్తలు టీడీపీలో మిగులుతారు అనేది సందేహాస్పదమే. ఎందుకంటే… తమ పార్టీ అధికారం లోకి రావడం లేదు అని ముందుగానే సంకేతాలు ఇచ్చేశాక, అదే వెళ్లి అధికార పార్టీతో పొత్తుకు సై అంటున్నాక, తాము ఆ పార్టీని పట్టుకుని వేలాడడం అవసరమా అనే ఆలోచనతో పెద్ద యెత్తున కార్యకర్తలు తెరాసలోకి జంప్ కాకుండా ఉండరు. ఇలా అటు లీడర్లని, ఇటు కేడర్ని పోగొట్టుకుని పతనం అంచుకు చేరిన పార్టీ ఎన్నికల సమయంలో కెసిఆర్ తో పొత్తు కుదుర్చుకునే స్థితిలో ఉంటుందా? అసలు ఇన్ని సీట్లు కావాలి అని డిమాండ్ చేసే స్థితిలో అయినా ఉంటుందా? పైగా ఇలాంటి విషయాల్లో కెసియార్ ఇచ్చే హామీలు ఎలా ఉంటాయో చరిత్ర చెబుతూనే ఉంది. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తానన్న కెసియార్ చివరకు ఆ పార్టీని ఏ స్థితిలోకి నెట్టారో తెలిసిందే. మరి అలాంటి వ్యక్తి మునిగిపోతున్న తెలుగుదేశం పార్టీని తేల్చి, దానిని నిలబెడతారా? ఒకవేళ సరేనని ఓ అరడజనుకు కాస్త అటో ఇటో సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా, పార్టీ గెలిచాక తెదేపా ఎమ్మెల్యేలని కూడా తమ పార్టీలో కలిపేసుకోడని గ్యారంటీ ఏమిటి? ఇదే ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషుల్ని ఆందోళనకు గురి చేస్తోన్న అంశం.
నిజానికి ఎపికన్నా మిన్నగా బలమైన కేడర్‌తో తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీకి ఈ పరిస్థితి దాపురించడం నిజంగా ఆ పార్టీకి అత్యంత విషాదకరమైన విషయమే. ఈ పరిస్థితుల్లో… ఏదో అద్భుతం జరిగితే తప్ప రాబోయే కాలంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రాభవం… ఇక గత కాలపు వైభవమే.