టీవీలలో ఉదయం పూట రాజకీయ చర్చలు రచ్చరచ్చగా మారడంపై చాలా మంది విసుక్కుంటుంటారు. విషయాలు తెలుసుకోవాలని కూచుంటే వాళ్లలో వాళ్లు వాదించుకుంటే ఉపయోగం ఏమిటి? ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటే మాకేం అర్థమవుతుంది? అని ప్రేక్షకులు అడుగుతుంటారు. ఒకప్పుడు కేవలం విశ్లేషకులు మేధావులతోనే ప్యానల్ నడిపిన సందర్భాలు వున్నా మార్నింగ్ డిబేట్స్ మాత్రం రాజకీయ వాదనలతోనే నడుస్తుంటాయి. వాటిమధ్య మాలాటి వాళ్లం బాలన్స్ చేసి ఏదో చెప్పవలసి వస్తుంటుంది. ఈ నేపథ్యంలో టివి5 చానల్ శని, ఆది వారాలలో కేవలం విశ్లేషకులతోనే ఉదయం పూట చర్చ జరపాలని నిర్ణయం తీసుకుంది. శనివారం నాడు నేను, ఎంఇవి ప్రసాదరెడ్డి,చలసాని శ్రీనివాస్, లక్ష్మీనారాయణ ప్యానల్‌గా వున్నాము. రాజకీయాలతో సంబంధం లేకుండా అని ఎడిటర్ విజరు నారాయణ అన్నప్పుడు ప్రత్యక్ష రాజకీయ ప్రతినిధులు కాకుండా అని సవరించాను. ఆయనా అదే చెప్పారు. చైర్మన్ నాయుడు గారి సూచనపై ఈ ప్రయత్నం చేస్తున్నట్టు ప్రకటించారు. చర్చ ఎలా జరిగిందనేది పక్కనపెడితే కొంత నిగ్రహంగా సమగ్రంగా వుండే అవకాశం ఎక్కువ. ఏమంటే రాజకీయ పార్టీలలో చాలా భాగం తమ తరపున వెళ్లిన వారి పెర్మామెన్స్ను సమీక్షించి మార్కులు లేదా రిమార్కులు వేస్తుంటాయి. తెలుగుదేశంలో ఇది మరీ ఎక్కువ కాగా ఇతర పార్టీలోనూ కొంత వరకూ వుంది. ఈ కారణంగానే పాలక పార్టీల తరపున వచ్చిన ప్రతినిధులు తమ నాయకులను లేదా పరిశీలకులను మెప్పించడం కోసం అవసరాన్ని మించి ఆవేశపడే సందర్భాలు చాలా వుంటాయి. మేము మౌనంగా వుంటే మాట్లాడలేదంటారు సార్ అని వారు తమ బాధ చెబుతుంటారు. ఇది ముదిరి కొన్నిసార్లు అవతలివారిని అస్సలు మాట్లాడనీయకుండా అడ్డుపడటం జరుగుతుంటుంది. అయితే రాజకీయ పార్టీల తరపున వచ్చే వారిలోనూ ముగ్గురు నలుగురే మరీ ఎక్కువ గొడవ చేస్తుంటారు. మరికొందరు అవసరం లేకపోయినా తమ నేతలను పొగడ్డానికి చెప్పిందే చెప్పడానికి సమయం తినేస్తుంటారు. బహుశా ఇవన్నీ దృష్టిలో వుంచుకుని టివి5లో ఈ కొత్త ప్రయత్నం మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది. సఫలం కావాలని వారాంతపు వైవిధ్యంగా వుండాలని ఆశిద్దాం.