ఎవరు అధికారంలో ఉంటే వారికి మర్దన చేయడం టీవీ9కి డ్యూటీ అయిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ జగన్ రెడ్డి భజన చేసి.. ఆ పార్టీనే గెలుస్తుందని పోల్ స్ట్రాట్ పేరుతో సొంత ఎగ్టిట్ పోల్ కూడా వేసిన టీవీ9 ఇప్పుడు సిగ్గు కూడా పడకుండా బాబు బంగారం అంటూ కథనాలు వండి వారుస్తోంది. గత ఐదేళ్ల కాలంలో టీడీపీపై టీవీ9 చేయని దుష్ప్రచారమే లేదు. మీడియా అంటే ప్రతిపక్ష పాత్ర పోషించాలి.. కానీ టీవీ9 అనేది వాటి యజమానుల వ్యాపార ప్రయోజనాలు కాపడటానికి ఓ టూల్ గా మారిపోయింది.
అధికారంలో ఉన్న వారిని కాకా పట్టి భూములు, గనులు రాయించుకోవడం… తాము చేసిన అడ్డగోలు పనులకు శిక్షలు పడకుండా తప్పించుకోవడానికి అధికార పార్టీలను పొగడడం… ఆయా పార్టీలను ఆకాశనికెత్తడం… కనీస జర్నలిజం విలువలు లేకుండా ప్రతిపక్ష నేతలపై తప్పుడు ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలు చేయించే కథనాలు రాయడం… లాంటివి కామన్ గా మారిపోయాయి. తాము ఎంత గాలి కొట్టినా..తమను జనం నమ్మరని.. తాము ఒక్క ఓటు కూడా ప్రభావితం చేయలేమని క్లారిటీ వచ్చిందో రాలేదో కానీ.. ప్రభుత్వం మారగానే వారి స్టాండ్ కూడా మారిపోతోంది.
మెల్లగా ప్రభుత్వంలో ఉన్న వారిని కాకా పట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బాబు బంగారం అంటూ స్టోరీలు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎంత ఘోరమైన ప్రచారాలు చేశారో లెక్కేలేదు. ఆయన కూడా అద్భుతంగా పని చేస్తున్నారని చెబుతున్నారు. రైతు బంధు సొమ్ము సరిగ్గా జమ చేయకపోయినా పర్ ఫెక్ట్ గా వేశారని.. రుణమాఫీ కూడా చేసేశారన్నట్లుగా కథనాలు వేస్తున్న టీవీ9ని చూసి జనం కూడా నోరెళ్లబెట్టాల్సి వస్తోంది.