కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసేది లేదని ప్రతిపక్ష వైకాపా పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.ఇ. ప్రభాకర్ ఏకగ్రీవ ఎన్నిక అనుకున్నారు. గెలుపు లాంఛమే అయినా పోటీ ఉండదని అనుకుంటే… చివరిగా మరో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సమాజ్ వాది పార్టీ తరఫున ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి వచ్చారు. దీంతో ఎన్నిక అనివార్యమౌతుందా అనే చర్చ జరుగుతోంది. నామినేషన్ల ఉప సంహరణకు 29వ తేదీ వరకూ సమయం ఉంది కాబట్టి, ఏకగ్రీవం తథ్యమనే అంచనాతో అధికార పార్టీ ఉంది. అయితే, వీరిలో సమాజ్ వాది పార్టీకి చెందిన దండు శేష యాదవ్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. అంతేకాదు, ఒక ఎంపీటీసీ సంతకాన్ని ఫోర్జురీ చేశారంటూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు అందడంతో ఆయనకు నోటీసుల కూడా జారీ చేశారు.
టీడీపీతోపాటు పోటీలో మిగిలింది పున్యాల నాగిరెడ్డి, జయప్రకాష్ రెడ్డి. ఈ ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతో టీడీపీ నాయకుల మంతనాలు చేస్తున్నట్టు సమాచారం! ఈ ఇద్దరిలో నాగిరెడ్డితో టీడీపీ చర్చలు కాస్త తీవ్రంగా జరుగుతున్నాయని తెలుస్తోంది! ఎందుకంటే, ఈయన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. అంతేకాదు, ఎలాగూ వైకాపా పోటీలో లేదు కాబట్టి… నాగిరెడ్డికి ఆ పార్టీ నుంచి కొంత మద్దతు లభించే అవకాశం ఉందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. వైకాపాకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బైరెడ్డి అనుచరుడి వెంట నిలుస్తున్నారనీ, పోటీ నుంచి తప్పుకున్నామని ప్రకటించినా, తెర వెనక నుంచీ టీడీపీని దెబ్బ తీసే వ్యూహంలో వైకాపా ఉందనే కథనాలు ఇప్పుడు కర్నూలు జిల్లాలో గుప్పుమంటున్నాయి.
సంఖ్యాపరంగా చూసుకుంటే పోటీకి దిగినా వైకాపా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి, నేరుగా పోటీ చేసి మరోసారి ఓటమి భారాన్ని తలకెత్తుకునే కంటే, తప్పుకోవడమే మంచిదనే నిర్ణయంతో వైకాపా నిర్ణయం తీసుకుంది. దీంతో స్వతంత్ర అభ్యర్థికి లోపైకారీగా మద్దతు ప్రకటించి.. అధికార పార్టీని కొంత దెబ్బ తీసే ప్రయత్నం ఏదైనా జరుగుతోందా అనేదే ఇప్పుడు అనుమానం. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమా కాదా అనేది తెలాలంటే మరో రోజు ఆగాల్సిందే. బైరెడ్డి అనుచరుడితో చర్చలు సాగిస్తున్నామనీ, గురువారం సాయంత్రానికే ఆయన నామినేషన్ ఉప సంహరించుకునే అవకాశం ఉందని టీడీపీ నేతల అభిప్రాయపడుతున్నారు. మరో అభ్యర్థిగా ఉన్న ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ కూడా పోటీ నుంచి తప్పుకుంటారనీ, ఆయన వెనక మద్దతుగా నిలిచేవారు కూడా పెద్దగా లేరనే అంటున్నారు.