పశ్చిమ బెంగాల్ ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.
ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ట్రైనీ డాక్టర్ పై జరిగింది సామూహిక అత్యాచారమని గతంలో వార్తలు రాగా.. తాజాగా అందులో ఎలాంటి వాస్తవం లేదని సీబీఐ విచారణలో తేలినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సంజయ్ రాయ్ ఒక్కడే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని సీబీఐ నిర్ధారించినట్లుగా పేర్కొన్నాయి.
వెస్ట్ బెంగాల్ పోలిసుల నుంచి సీబీఐకి బదిలీ చేసినా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని.. దర్యాప్తు నత్తనడకన కొనసాగుతోందని ఇటీవల పలువురు సీబీఐ విచారణపై పెదవి విరిచారు. ఈ క్రమంలోనే ఈ వార్త బయటకు రావడం గమనార్హం. కాగా, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మృతురాలి బాడీలో 150mg వీర్యం ఉందని తేలినట్లుగా ప్రచారం జరిగింది. దాంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని వార్తలు వచ్చాయి.
ఈ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంటుందనే తరుణంలో ఇది సామూహిక అత్యాచారం కాదుని సీబీఐ సంబంధిత వర్గాలు పేర్కొనడం చర్చనీయాంశం అవుతోంది.