ప్రధానమంత్రి మోదీ దృష్టిలో ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నవి రెండేనట. అందుకే ఆ రెండు సవాళ్లను ఎదుర్కోగలిగితే ప్రపంచ మానవాళి సుఖంగా ఉంటుందని ఆయన పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఇంతకీ ఆ రెండు ఏమిటంటే..
మనం హాయిగా ఉండాలంటే మనకు ప్రమాదం కలిగించే వాటికి దూరంగానైనా ఉండాలి లేదా అవి లేకుండానైనా చేసుకోవాలి.
మోదీ చెప్పిన రెండు సవాళ్లలో మొదటిది – ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఉగ్రవాదం. రెండవది – వాతావరణలో పెనుమార్పులు. ప్రధానమంత్రి తుర్కెమెనిస్థాన్ రాజధానిలో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కుంటున్న పెద్ద సవాళ్లు టెర్రరిజం, వాతావరణలో వస్తున్న పెనుమార్పులేనని చెప్పారు. శాంతి స్థాపన ద్వారా ఉగ్రవాదమన్నది లేకుండా చేయవచ్చనీ, అలాగే పర్యావరణాన్ని కాపాడుతుంటే, వాతావరణంలో పెనుమార్పులు లేకుండా చూసుకోవచ్చని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన జాతిపిత గాంధీని స్మరించుకున్నారు. గాంధీ మార్గంలో సాగితే ఈ రెండు సవాళ్ల నుంచీ మనం బయటపడవచ్చని చెప్పారు. యోగా ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చనీ, అప్పుడే చెడు ఆలోచనల నుంచి దూరంగా ఉండేందుకు వీలు చిక్కుతుందని మోదీ అక్కడివారికి హితవు పలికారు.
ప్రపంచ యోగా గురువు మోదీ !
యోగాతో నూతన ప్రపంచ ఆవిష్కరణ జరుగుతుందని మోదీ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఏ దేశమేగినా ఎందుకాలిడినా యోగా ఉపన్యాసాలే దంచికొడుతున్నారు. ప్రపంచ సవాళ్లకు విరుగుడు గాంధీ సిద్ధాంతాల్లోనూ, యోగాలోనూ ఉన్నదని ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు. అప్పుడెప్పుడో స్వామీ వివేకానందులవారు, మహాత్మా గాంధీ వంటి వారు విదేశాల్లో మన సంస్కృతిలోని పరమోన్నత శక్తిని విశదపరిస్తే, మళ్ళీ ఇన్నాళ్లకు మోదీ ఆ పని చేయడం నిజంగా సంతోషించదగినదే. రాజకీయాలు, వ్యూహాలు వంటి వాటిని పక్కనబెడితే, మోదీ ఆలోచనలు ప్రపంచ దేశాలన్నీ ఆచరింపదగినవేనని శాంతి కాముకులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాను పరిచయం చేయడంలో ఆయన తొలి విజయం సాధించారు. ఆత్మశక్తికి మించిందిలేదనీ, మహాత్మా గాంధీ అనుసరించిన మార్గం అత్యుత్తమమైనదని మోదీ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇలా, ఇలా సాగుతూ ఆయన ప్రపంచ యోగ గురువుగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
– కణ్వస