సికింద్రాబాద్లో కిషన్ రెడ్డిని ఓడించాలని టార్గెట్ పెట్టుకున్న బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు చివరికి ఎమ్మెల్యేలను అభ్యర్థులుగా ఖరారు చేశాయి. వారిద్దరూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేస్తూండగా.. బీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను కేసీఆర్ ఖరారు చేశారు. నిజానికి అసలు పద్మారావు పేరు ఎప్పుడూ ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలోకి రాలేదు. కానీ చివరికి ఆయననే ఎంపిక చేయాల్సి వచ్చింది.
సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ కోసం మొదట్లో తలసాని కుమారుడు పోటీ పడ్డారు. గత ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సికింద్రాబాద్ పరిధిలో లక్షన్నర ఓట్లకుపైగా ఆధిక్యత కనిపించడంతో గెలుపు సులువు అవుతుందనుకున్నారు. కానీ పోటీ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తేలడంతో ఆగిపోయారు. తన కుమారుడికే కాదు.. తనకూ వద్దని స్పష్టం చేశారు. తలసాని బలమైన అభ్యర్థి అవుతారని కేసీఆర్ భావించారు. తలసాని కూడా వద్దన్నారు.
ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరికి పద్మారావును ఖరారు చేశారు. గట్టి పోటీ ఇస్తారని.. బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే తలసాని తోపాటు ఇతర నేతలు ఎంత వరకూ గట్టిగా సహకరిస్తారన్నది కీలకం. మజ్లిస్ పార్టీ మద్దతు కీలకం. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి వారి మద్దతు ఉంటుందని చెబుతున్నారు. ఎలా చూసినా బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితుల్లో పద్మారావు పోటీకి దిగుతున్నారు.