తెలంగాణలో టిడిపి పరిస్థితి అసలే అంతంతమాత్రంగా వుంటే అందులో తీవ్ర విభేదాలు నెలకొనడం అదనపు సమస్యగా మారింది. అయితే అస్తిత్వం కాపాడుకోవడం ఎలాగన్నదే ఈ విభేదాలకు మూలకారణం. టిఆర్ఎస్ బిజెపిలతో వెళ్లడం మంచిదనే వారు ఒక వర్గం కాగా కాంగ్రెస్‌తో కలసి వెళదామనే వారు మరో వర్గం. ఈ విభజన కూడా కులాల వారిగా వుండటం షరా మామూలే. అనంతపురంలో కెసిఆర్ పర్యటనపై రేవంత్ రెడ్డి విరుచుకుపడటంలో ఆంతర్యం అదే.ఎంఎల్‌సి పయ్యావుల కేశవ్‌తో మాట్లాడ్డం, వచ్చినప్పుడు కలవమని ఆహ్వానించడం కెసిఆర్ వ్యూహంలో భాగమేనని, ఆ సామాజిక వర్గాన్ని మంచి చేసుకోవడం కోసమే బాహాటంగా ఈ సంకేతాలిచ్చారని చెబుతున్నారు. ఉద్యమ కాలంలో ఆత్మాహుతి బాంబునవుతానన్న కేశవ్ తెలంగాణలో చాలా విమర్శలనెదుర్కొన్నారు. అయినా నిస్సంకోచంగా కెసిఆర్ ఆయనతోనే మాట్లాడారంటే మారిన పరిస్థితులే కారణం. మొన్న నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ముఖ్యపాత్ర వహించారు.ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే వ్యక్తిగత ప్రాధాన్యత, రాష్ట్రంలో అత్యున్నత పదవి కావాలన్నది ఆయన ఆశ ఆశయం కూడా. దాచుకోకుండా ఇది అందరికీ చెబుతూనే వుంటారు. రెడ్లు మాత్రమే ఇప్పుడు కెసిఆర్‌ను ఎదుర్కోగలరు గనక వారికి బలం వున్న కాంగ్రెస్‌తో కలుద్దామని అనడమే గాక సింగరేణి ఎన్నికల్లో రెండడుగులు వేశారు కూడా. అయితే అధికారికంగా తెలుగుదేశం నాయకత్వం ఈ వ్యూహానికి ఆమోదముద్ర వేయలేదు. .ఆయనను చేర్చుకోవడానికి కాంగ్రెస్‌లో ఇప్పుడున్న బలమైన నేతలు కొందరు సుముఖంగా లేరు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి డికెఆరుణ పేరు ప్రముఖంగా చెబుతున్నారు గాని వాస్తవంలో అంతకంటే కూడా వ్యతిరేకించేవారున్నారు. ఆయన రాకవల్ల అంగబలం అర్థబలం పెరిగేది లేదని వారి వాదన. వ్యక్తిగతంగా యువతలో రేవంత్ పట్ల ఆకర్షణ వున్నా ఇంతకాలం వున్న మనమెందుకు కాంగ్రెస్ వేదికను అప్పగించాలని వ్యతిరేకించేవారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఎలావున్న తన గురించి ఇంత చర్చ జరుగుతుంటే మంచిదేనని రేవంత్ సంతోషిస్తుండొచ్చు కాని తెలుగుదేశంకు ఇది ప్రాణ సంకటమే. మోత్కుపల్లి నరసింహులు బయిటపడి టిఆర్ఎస్తో పొత్తును ప్రతిపాదించగా రాష్ట్ర పార్టీ అద్యక్షుడు రమణ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని దాటేస్తున్నారు.ఈ విషయంలో చెప్పుకోవలసిన అంశాలు ఇంకా చాలా వున్నాయి….