తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారుతోంది. తాజాగా ఇద్దరు పోలీసు అధికారుల్ని అరెస్టు చేశారు. ఒకరు ఏఎస్పీగా.. మరొకరు డీసీపీగా పని చేస్తున్నారు. వీరిద్దరూ నేరుగా ట్యాపింగ్ వ్యవహారంలో పాలు పంచుకున్నట్లుగా తేలడంతో అరెస్టు చేశారు. మరో వైపు ప్రణీత్ రావు కస్టడీ ముగిసింది.
ప్రణీత్ రావు కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు, ఐన్యూస్ ఎండీ శ్రవణ్ రావులు మొత్తం ట్యాపింగ్ మాఫియాకు పిల్లర్లు. బీఆర్ఎస్ కీలక నేతలు.. రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేయమని చెప్పారు.. వీరు రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసి.. బ్లాక్ మెయిల్ దందా చేశారని గుర్తించారు. తమ ఘోరాలు బయటకు వస్తాయని తెలియడంతో వారిద్దరూ విదేశాలకు పారిపోయినట్లుగా గుర్తించారు. ఈ కారణంగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
నిజానికి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు శాఖలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఓ సామాజికవర్గానిదే పెత్తనం. ఇతరులు ఎంత సీనియర్ అధికారులైనా కనీస అధికారం ఉండదు. ఇలాంటి వాటి వల్లే… మొత్తం బయటకువచ్చాయి. ఇప్పుడు తమపై పెత్తనం చేసిన ఆ సామాజికవర్గం అధికారుల గుట్టు అంతా .. పోలీసు ఉన్నతాధికారులు బయట పెట్టడానికి సిద్ధమయ్యారు. ఆధారాలు ఎలా సేకరించాలో వారికి బాగా తెలుసు. మొత్తం ట్యాపింగ్ దందాపై ఆధారాలు ఉన్నాయని… పై స్థాయి నేతల వరకూ అందర్నీ నేరస్తులుగా పెట్టడానికి అవసరమైన సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు. ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తుందని చెబుతున్నారు.