వైసీపీ ఢిల్లీలో ధర్నా చేపట్టేందుకు రెడీ అవ్వగా…ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఇద్దరు మండలికి హాజరు కావడం హాట్ టాపిక్ అయింది. బుధవారం ఢిల్లీలో ధర్నా తలపెట్టడంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జగన్ ఢిల్లీ వెళ్ళారు. కానీ , ఇద్దరు మాత్రం ఢిల్లీకి వెళ్లకుండా మండలిలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆరోపిస్తూ ఢిల్లీలో చేపడుతోన్న ధర్నాను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ధర్నాను విజయవంతం చేయాలని పట్టుదలతో ఉంది. అందుకే పార్టీ ప్రతినిధులను అంతా ఢిల్లీకి రావాలని ఆదేశించింది. ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఢిల్లీ బాట పట్టింది. అందరూ జగన్ వెంట ఢిల్లీ వెళ్ళినా ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంకా రవీంద్ర మాత్రం మంగళవారం మండలికి హాజరయ్యారు.
Also Read : మొత్తానికి అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకే జగన్ ఫిక్స్ అయ్యారా?
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళ, బుధవారాల్లో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారని జగన్ ముందే ప్రకటించారు. కానీ, మాధవరావు, రవీంద్రలు మాత్రం ఢిల్లీకి డుమ్మా కొట్టి కౌన్సిల్ కు హాజరు కావడంతో .. కూటమి సభ్యులు.. మీరు ఢిల్లీ వెళ్లలేదా…? అంటూ అడిగారు. వైసీపీ ఎమ్మెల్సీలంతా ఢిల్లీ వెళ్తే.. ఈ ఇద్దరు మాత్రమే మండలికి హాజరు కావడంతో వీరు త్వరలోనే వైసీపీని వీడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
మండలిలో కూటమి సర్కార్ కు ఎలాగూ బలం లేకపోవడంతో వైసీపీ సభ్యులను చేర్చుకోవాలని భావిస్తే చేరికలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు.