జగన్ సీఎంగా ఉన్నంత కాలం రాష్ట్రం ఏమైపోయినా…. అక్రమ మద్యం వ్యాపారం, ఇసుక వ్యాపారాలతో కుదేలైపోయినా… ఎప్పుడో ఓ సారి ప్రెస్ మీట్ పెట్టి సలహాల స్థాయిలో విమర్శలు చేసే ఆయన ఇప్పుడు మాత్రం ఆత్రం ఆపుకోలేకపోతున్నారు. వారానికోసారి ప్రెస్ మీట్ పెట్టి.. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రం మొత్తం వర్షాలతో అతలాకుతలం అవుతూంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మార్గదర్శి విషయంలో వేసి అఫిడవిట్ గురించి చంద్రబాబు సర్కార్ నిందిస్తున్నారు.
మార్గదర్శి అనేది ఆయనకూ కూడా సమస్య కాదు. వారి కుటుంబసభ్యులు వేసిన చిట్స్ కు కూడా వడ్డీతో సహా చెల్లించారని ఆయన చెప్పుకున్నారు. అయినా ఆయన అయిపోయిన పెళ్లికి మేళంలాగా… ఏడుపులు మాత్రం ఆపడం లేదు. మార్గదర్శిపై జగన్ వేసిన అఫిడవిట్ చంద్రబాబు భేషరతుగా విత్ డ్రా చేసేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అది సరి కాదని ఆయనంటున్నారు. అసలు ఒక్క బాధితుడు లేని కేసులో ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వా కావాలో మాత్రం ఆయన చెప్పడం లేదు. అగ్రిగోల్డ్ భూముల్ని దోచడంపై కూడా ఆయన స్పందించలేదు.
కానీ మార్గదర్శిని మాత్రం కలవరిస్తున్నారు మార్గదర్శి విషయంలో చంద్రబాబు చేసిన పని ఆయనకు చరిత్రలో పెద్ద మచ్చ అవుతుందని.. బెదిరించారు. చంద్రబాబు తన పరిణితికి తగ్గట్టుగా పనిచేయలేదని.. నిబంధనల ప్రకారం చిట్ ఫండ్ కంపెనీలు ఇతర వ్యాపారాలు చేయకూడదన్నారు. మార్గదర్శికి ఉపకారం చేయాలనుకుంటే చంద్రబాబుకు ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని.. రిజర్వ్ బ్యాంకుకు లెక్కలు చెప్పకుండా మార్గదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మార్గదర్శి ఇష్యూను పట్టుకుని వేలాడారు.. జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఒక్క ఖాతాదారుడూ డబ్బులు ఎగ్గొట్టారని చెప్పలేదు. సిగ్గుపోయినా ఇంకా ఉండవల్లి అదే మాటలు మాట్లాడుతున్నారు.