జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం చేశారు… అంటూ చాలామంది విమర్శిస్తారు! ఆరంభ శూరత్వం తప్ప… ఆయన ఏపనీ పూర్తిస్థాయిలో చేయడం లేదని అనవసరంగా అనేస్తుంటారు..! మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలు వినండీ… పవన్ ఏంటో, పొలిటికల్ గా ఆయన పవర్ ఏంటో, పవన్ వల్ల ఢిల్లీ ఎలా వణుకుతోందో అర్థమౌతుంది. ఒక్కసారి ఉండవల్లికి అర్థమైన పవన్ ను సవధాన చిత్తంగా దర్శించే ప్రయత్నం చెయ్యండి..! ఈరోజున ఏపీ ప్రయోజనాల కోసం పవన్ రగిల్చిన పోరాటం ఏంటో, అధికార ప్రతిపక్ష పార్టీల్లో ఆయన రగిల్చిన స్ఫూర్తేంటో అర్థమౌతుంది.
ఐవీఆర్ కృష్ణారావు రాసిన ఓ పుస్తకావిష్కరణకు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ్ల ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడినా సర్ ర్ ర్ ర్ మని అంటోందన్నారు! ఎన్నిరోజులు పార్లమెంటు ఆగిపోయిందో చూశాం కదా, పార్లమెంటు ఆగిపోవడానికి కారణం అవిశ్వాస తీర్మానమే కదా, అవిశ్వాసం నేను పెడతానంటే నేను అంటూ పార్టీలు క్యూల్లో నిలబడటానికి కారణం పవన్ కల్యాణే కదా… అనే రహస్యాన్ని ఉండవల్లి చెప్పడం జరిగింది! ప్రస్తుత సమయంలో రాజకీయాల్లోకి రావాలనుకోవడం పవన్ కల్యాణ్ తీసుకున్న అతిపెద్ద రిస్క్ అన్నారు. ‘మీరు ఏ పార్టీకి ఓటేసినవాళ్లయినా, మీరు ఏ ఆలోచనలో ఉన్నవారైనా, ఇలాంటి వాడికి (అనగా పవన్‌కి) ఆశీర్వాదం ఇవ్వాల్సిన అవసరం మనందరి మీదా ఉంది’ అని ఉండవల్లి పిలుపునిచ్చారు. పోరాడతా అని ఒక మనిషి ముందుకు వచ్చినప్పుడు వెనక మేమున్నాం అనే భరోసా ఇవ్వకపోతే మనకి మనమే ద్రోహం చేసుకున్నట్టు అవుతుందని ఉండవల్లి చెప్పడం జరిగింది.
అవునా… ఇన్నాళ్లూ ఈ లెక్క మనకు అర్థం కాలేదు సుమండీ..! తలలు పండిన రాజకీయ విశ్లేషకులకు సైతం ఈ మర్మం తెలీలేదు చూడండి..! ఈ కార్యాకారణ సంబంధాన్ని ఇన్నాళ్లూ మనం అర్థం చేసుకోలేకపోయాం… ప్చ్..! పార్లమెంటును టీడీపీ ఎంపీలు స్తంభింపజేస్తుంటే, ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఘోషిస్తుంటే, భాజపాతో ఉన్న బంధాన్ని టీడీపీ తెంచుకుంటే… వీటన్నింటి వెనకా పవన్ కల్యాణ్ ఇచ్చిన స్ఫూర్తి ఉందని ఉండవల్లి చెప్పేవరకూ తెలుసుకోలేకపోయాం..! పవన్ కల్యాణ్ చేసిన కృషిని ఉండవల్లి చెబితేగానీ గుర్తించలేకపోయాం..! జె.ఎఫ్.ఎఫ్.సి. లెక్కల్ని గాలికి వదిలేశారనీ, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి పాదయాత్రకు పరిమితం అవుతున్నారనీ, ఢిల్లీ వెళ్లి పోరాడతానని చెప్పి గల్లీల్లో ఉండిపోతున్నారనీ, హోదా ఉద్యమాన్ని నీరు గార్చేశారనీ, అవకాశం ఉండి కూడా సరైన దారిలో వెళ్లడం లేదనీ… ఇలా పవన్ కల్యాణ్ పనితీరుపై వ్యాఖ్యానిస్తున్నవారంతా ఉండవల్లి మాటలు విన్నాక జ్ఞానోదయం పొందుగాక..! ఇతి ఉండవల్లి ప్రవచిత పవన్ కల్యాణ్ విశ్వరూప సందర్శన యోగా సమాప్తహః..!