తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీ పై టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ముందుగానే సమాచారం ఉండటంతో అన్ని జిల్లాల్లో నేతలు సంబరాలకు ముందుగానే ఏర్పాట్లు చేసుకుని కేసీఆర్ ప్రసంగం ప్రారంభించగానే టపాసులు కాల్చేశారు. అయితే ఆ టపాసులు అయిపోయిన తర్వాత పట్టించుకున్న వారు లేరు. నిరద్యోగులు ఎవరూ బాహుబలి నోటిఫికేషన్ వచ్చిందని రోడ్లపైకి వచ్చి ఆనందం వ్యక్తం చేయలేదు. ఓ రకంగా నిరుద్యోగుల్లో ఈ ఉద్యోగాల భర్తీప్రకటనపై పూర్తి స్థాయిలో నమ్మకం కలగడం లేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.
కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటనలు చేయడం ఇదే తొలి సారి కాదు. గత రెండు, మూడేళ్లలో ఎన్నో సార్లు ఇక నోటిఫికేషన్లే అని ప్రకటిస్తూ వస్తున్నారు. అసెంబ్లీలో కేసీఆర్ ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు వస్తాయని.. దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కానీ ఎలాంటి విధి విధానాలు ప్రభుత్వం నుంచి రాలేదు. నిరుద్యోగుల్లో కేసీఆర్ పై నమ్మకం తక్కువ స్థాయిలో ఉంది. నోటిఫికేషన్లు ఇవ్వరని.. ఇచ్చినా ఏదో ఓ వివాదంతో కాలయాపన చేస్తారని.. డబుల్ బెడ్ రూం ఇళ్లు, వరద సాయం… దళిత బంధు తరహాలోనే .. మధ్యలో పెట్టి ఎన్నికలకు వెళ్తారని.., విపక్షాలు అడ్డుకున్నాయని ప్రచారం చేస్తారని అనుమానిస్తున్నారు.
అందుకే నిరుద్యోగుల్లో అంత ఉత్సాహం కనిపించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ గతంలో చేసిన ప్రకటనలు..అవి అమలుకు నోచుకోకపోవడం వంటి వాటి వల్లనేఈ సమస్య వచ్చింది. ఈ సారికేసీఆర్ ట్రాక్ మార్చి.. ఉద్యోగాలను భర్తీని వేగంగా పూర్తి చేస్తే ఆయనపై క్రెడిబులిటీ పెరిగే అవకాశం ఉంది.