తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది. చేరికలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్17న కాంగ్రెస్ లోకి భారీ చేరికలు ఉండనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సమక్షంలో అధికార పార్టీకి చెందిన బడా నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభా వేదికపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు. ఈ క్రమంలోనే అదే వేదికపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్‌లోకి రావడానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయిన క్రమంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెప్టెంబర్ 17న తుమ్మల కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. అలాగే తన కొడుకుతో సహా మైనంపల్లి కూడా అదే రోజు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. కేసీఆర్ పై పోరాటం చేయడానికి బీజేపీలో చేరిన నేతలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్17న ఊహించని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పార్టీలోకి వచ్చే నేతలతో సీక్రెట్‌గా కాంగ్రెస్ కీలక నేతలు చర్చలు జరుపుతున్నారు.
ఎవరూ ఊహించని చేరికలు ఉండబోతున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ టిక్కెట్లు ప్రకటించిన నేతలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే టిక్కెట్ ప్రకటించిన మైనంపల్లి కాంగ్రెస్ లోకి వెళ్లాలని డిసైడయ్యారని.. మరో ఇద్దరు ముగ్గురు కూడా అదే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఊహించని ట్విస్టులు ఇస్తామని కాంగ్రెస్ నేతలంటున్నారు.