యూపీలో ఐదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి ఉచిత హమీల వరదపారించింది. మేనిఫెస్టోను ‘లోక్ కల్యాణ్ సంకల్ప పత్రం’ పేరుతో అమిత్ షా విడుదల చేసింది. ఇందులో ప్రతీ పేజీ నిండా తాయిలాలే ఉన్నాయి. ముఖ్యంగా యోగి సర్కార్‌పై రగిలిపోతున్న రైతులు, నిరుద్యోగులకు చాలా తాయిలాలు ప్రకటించారు. ఐదేళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని భారీ హామీ ఇచ్చారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఉంటే.. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా వాటిని తొలగించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్టుబడుతోంది. అదే బీజేపీ యూపీలో మాత్రం ఉచిత విద్యుత్ హామీ ఇచ్చేసింది. ఇక పీఎం కిసాన్ సాయం రెట్టింపు చేస్తామని కూడా హామీ ఇచ్చారు.
ఇక మరోసారి అధికారంలోకి వస్తే విద్యార్థినుల, ఉద్యోగం చేసే మహిళలకు ఉచిత స్కూటీలు, విద్యార్థినులకు యూపీఎస్సీ, పీఎస్సీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ , విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు కూడా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చేసింది. ఆన్ క్లాసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ల్యాప్ ట్యాప్‌లు ఇస్తామంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగులకు ఉద్యోగాలు ఖాయమని.. కనీసం ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేనిఫెస్టోలో రాసుకొచ్చారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్రం ప్రకటించిన ఏటా రెండు కోట్ల ఉద్యోగాల సంగతి ఎటు పోయిందో ఎవరూ అడగరు. అడిగినా చెప్పరు. ఏడాదిలో 3 సిలిండర్లు ఉచితంగా అందించడం.. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని పునరుద్ధరించడం వంటి హామీలను కూడా పొందు పరిచారు. నిన్నటిదాకా బాగా అభివృద్ధి చేశామని ప్రచారం చేసుకున్న బీజేపీ మేనిఫెస్టోలో దానికి ఎలాంటి అవకాశం కల్పించలేదు. కానీ తాయిలాలిచ్చి ఓట్లు పొందడానికి చేయగలిగినంత చేస్తోంది.