ఉత్తరప్రదేశ్లో విపక్షాలన్నీ ఏకమవడంతో.. కమలం వాడి పోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలన్నదానిపై ఆ పార్టీ అగ్ర నేతల్లో బీపీ ప్రారంభమైంది. విపక్షాలన్నీ ఏకమవడంతో.. బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకులన్నీ సంఘటితమయ్యాయి. వీటిని మళ్లీ చీల్చడం ద్వారానే తాము యూపీలో మళ్లీ పట్టు సాధించగలమనే ఆలోచన బీజేపీ హైకమాండ్ చేస్తోంది. అందు కోసం అనేక రకాల ప్రణాళికలు సిద్దం చేసుకుంది. ఈ ఏడాదిలోనే వాటిని అమలు చేయబోతోంది.
సమాజ్ వాదీ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఓబీసీలు. వీరిని ఎస్పీకి దూరం చేయడం అసాధ్యం. కానీ కొంత వర్గాలను మాత్రం దూరం చేయవచ్చు. దీని కోసం అమిత్ షా ప్రణాళిక సిద్ధం చేశారు. యూపీలోని 82 ఓబీసీ కులాలనూ మూడు కేటగిరీలుగా వర్గీకరించేందు ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేశారు. ఓబీసీలకు ఉన్న 27 శాతం రిజర్వేషన్లు సరిసమానంగా అందాలంటే ఈ వర్గీకరణ తప్పనిసరి అని బీజేపీ చెబుతోంది. అమిత్ షా ప్లాన్ ప్రకారం ఓబీసీలను వెనుకబడ్డ, చాలా వెనుకబడ్డ, అత్యంత వెనుకబడ్డ కేటగిరీలు విభజిస్తారు. మొదటి దానిలో 4, రెండో దానిలో 19, మూడో దానిలో 59 కులాలను చేరుస్తారు. ఈ వర్డీకరణ గనక జరిగితే అది యాదవులకు రాజకీయంగానూ, ఓబీసీలో ప్రాబల్యపరంగానూ గట్టి దెబ్బ పడుతుంది. ఓబీసీ కోటా 27 శాతంలో ఎక్కువగా లాభపడుతున్నది యాదవులే. దీనిపై ఇతర వర్గాల్లో ఆగ్రహం ఉంది. దీన్ని బీజేపీ ఓట్లుగా మల్చుకోవాలని డిసైడయింది.
యూపీలో గట్టెక్కడానికి బీజేపీ ప్రయోగించబోతున్న మరో అస్త్రం పదిహేడు ఓబీసీ కులాలను ఎస్సీల్లో చేర్చడం. ఈ కులాలను ఎస్సీల్లో చేర్చాలని ములాయం, అఖిలేష్ ముఖ్యమంత్రులుగా ఉన్నపుడు ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. కానీ కేంద్రం పట్టించుకోలేదు. అప్పట్లో మాయవతి వ్యతిరేకించారు. ఇప్పుడూ వ్యతిరేకిస్తారు. కానీ వ్యతిరికేంచడానికి అఖిలేష్ కు చాయిస్ లేదు. ఇప్పుడు అఖిలేష్, మాయవతి ఇద్దరూ మిత్రులు కాబట్టి… ఈ విషయంలో వారద్దరి మధ్య అభిప్రాయబేధాలు తీసుకురావడం…అమిత్ షా ప్లాన్. రాజకీయంగా వారి మధ్య రగడతో పాటు… ఈ ఓబీసీ కులాలను నిజంగానే ఎస్సీల్లో మోదీ ప్రభుత్వం చేర్చేస్తే.. బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. మరి ఈ ప్లాన్ ను బీజేపీ ఎలా అమలు చేస్తుందో.. వేచి చూడాల్సిందే..!