మంచి వర్షాలతో నిండుకుండలా ఉన్నాయి నీటి ప్రాజెక్టులు. సాగునీటికి, తాగునీటికి ఈ ఏడాది కష్టం ఉండదని సంతోషించే లోపే రైతులకు పిడుగులాంటి వార్త. అవును… నిన్న రాత్రి కొట్టుకపోయిన తుంగభద్ర డ్యాం 19వ గేటు మరమ్మత్తుల కోసం డ్యాంలో ఉన్న నీటిని చాలా వరకు ఖాళీ చేయాల్సి వచ్చేలా ఉంది.
గేటు నిర్మాణం పాత పద్ధతిలో జరిగింది. స్టాప్ లాక్ పద్ధతిలో నిర్మాణం జరిగి ఉంటే ఇబ్బంది ఉండకపోయేది. కానీ, ఇప్పుడు ఆ గేటును సరి చేయాలంటే దాదాపు 40టీఎంసీల నీటిని కిందకు వదలాల్సిన దుస్థితి ఏర్పడింది.
తుంగభద్ర డ్యాం కెపాసిటీ 105టీఎంసీలు. ఇప్పటికే 105టీఎంసీల నీరు డ్యాంలో ఉంది. అంటూ పూర్తిగా నిండిపోయింది డ్యాం. పై నుండి 30వేల పైచిలుకు క్యూసెక్కుల వరద వస్తుండగా… వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకు వదులుతున్నారు. కానీ, ఇప్పుడు 19వ గేటు కొట్టుకపోవటంతో ఆ ఒక్క గేటు నుండే 30వేల క్యూసెక్కుల నీరు కిందకు పోతుంది. మొత్తంగా 40వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.
కానీ, ఆ 19వ గేటును మరమత్తు చేయాలంటే కనీసం 40టీఎంసీల నీరు ఖాళీ చేయాల్సిందేనని అధికారులు తేల్చారు. కానీ అంత నీరు కిందకు ఒకేసారి వదిలితే… కిందనున్న శ్రీశైలం నుండి సాగర్, పులిచింతల ఇప్పటికే పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. వరదను క్రమంగా వదిలి, సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత వర్షాలు పడకపోతే రైతులకు ఇక ఇబ్బందే.
దీనిపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తుంగభద్ర వల్ల ఏపీ,తెలంగాణ, కర్నాటకలకు ఎంతో ఉపయోగం. కానీ ఇప్పుడు నీటిని ఖాళీ చేయాల్సిందే. అలా అయితేనే గేటు మరమ్మత్తులు సాధ్యం. కాబట్టి వచ్చే ఎండాకాలం పంటకు రైతులకు నీరు ఇవ్వటం కష్టమే… తాగు నీరుకు కూడా ఇబ్బందులు వస్తాయి కాబట్టి రైతులు అర్థం చేసుకోవాలి అంటూ డీకే శివకుమార్ కామెంట్ చేశారు.
ఈ గేటు కొట్టుకపోవటం, నీటిని కిందకు వదలటం వల్ల కర్నాటకతో పాటు ఏపీలోని రాయలసీమకు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.