తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ‘సర్వేలు’ అనే కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు సమాచారం! నిజానికి, ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచీ పార్టీ ఉత్సాహం నింపేందుకు సర్వేలనే ఆశ్రయిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందనీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమనీ, కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత నానాటికీ ఎక్కువౌతోందని కొన్ని సర్వేలు వదిలారు! కొంతమేరకు అవి పాజిటివ్ ఎఫెక్ట్ చూపించాయనే చెప్పాలి. ఆధిపత్య పోరుతో సతమతమౌతున్న టి. కాంగ్రెస్ కి ఈ సర్వేల తరువాత కొత్త ఉత్సాహం వచ్చిందనే వాతావరణం కనిపించింది. ఇక, ఈ మధ్య ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ టూర్ తరువాత మాంచి ఊపులో ఉన్నామని పీసీసీ ధీమాగా ఉంది. అయితే, ఆ సంబరాన్ని నీరుకార్చేలా ఈ మరికొన్ని సర్వేలు రావడంతో పీసీసీకి ఇదో కొత్త టెన్షన్ గా మారింది.
ఉత్తమ్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఉందని చెబుతుంటే… దీనికి కౌంటర్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన సర్వేలు తెరాసకు ప్రజాదరణ మరింత పెరిగిందని చెబుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలకు ఓటమి తప్పదంటూ ఈ మధ్యనే కేసీఆర్ ఓ సర్వే బయటకి వదిలారు. అయితే, దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ నుంచి ఎలాంటి సర్వేలు రాలేదు. కానీ, రాహుల్ రాష్ట్రానికి వచ్చారు. దీంతో సర్వే అవసరం లేకుండా పార్టీ వర్గాల్లో కాస్త ధీమా వస్తుందని ఉత్తమ్ అంచనా వేశారు. దీనికి తగ్గట్టుగానే రాహుల్ వచ్చి వెళ్లాక స్పీడ్ పెరిగిందని అందరూ భావించారు. కాంగ్రెస్ నేతలు కూడా అదే దూకుడును ప్రదర్శించారు. తెరాసపై విమర్శల స్వరాన్ని పెంచారు. అయితే, కాంగ్రెస్ ఉత్సాహానికి మరోసారి చెక్ పెట్టాలనుకున్న కేసీఆర్ మరో సర్వే చేయించారు. కాంగ్రెస్ కి కేవలం రెండు సీట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ఉత్సాహం పై నీళ్లు చల్లినట్టయింది. ముఖ్యమంత్రి సర్వే బోగస్ అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. తెరాసకు పది సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతోనే కేసీఆర్ భయపడుతున్నారంటూ నేతలు విరుచుకుపడ్డారు.
సరే.. ఈ టాపిక్ ను కూడా కాంగ్రెస్ నేతలు నెమ్మదిగా మరచిపోతున్నారు అనుకుంటే.. తాజాగా మరో స్వతంత్ర సర్వే వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలే 2019లో మరోసారి అధికారంలోకి వస్తాయంటూ ఆ సర్వే చెప్పింది. దీంతో మరోసారి టి. కాంగ్రెస్ కి టెన్షన్ పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇంకో సర్వే చేయిస్తే ఎలా ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే, సర్వేల జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అనీ, మనం ఒక సర్వే అంటే.. కేసీఆర్ మరొకటి అంటూ ఇది కొనసాగుతూనే ఉంటుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారట. పదేపదే సర్వేలు అంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదనీ, అంతా సానుకూలంగా ఉందని మనమే అనుకోవడం సరికాదని కూడా అభిప్రాయపడ్డారట! దీంతో ఇప్పుడు మరో సర్వే చేయించాలా వద్దా అనే డైలమాలో ఉత్తమ్ ఉన్నట్టు తెలుస్తోంది. రాహుల్ రాక తరువాత కాస్త సెట్ అయ్యాం అనుకుంటే ఈ సర్వేలతో కొత్త టెన్షన్లు వచ్చి పడుతున్నాయంటూ ఉత్తమ్ వాపోతున్నారట!