హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేసే సమయం రానుందని పీసీీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేలను చిన్నచూపు చూస్తున్నారని, వారికి ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే మూడునెలల సమయం పడుతోందని ఉత్తమ్ చెప్పారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధితో భేటీ అయిన తర్వాత ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీలలో ఉన్నవారిని తీసుకోవటం, తెలంగాణ ఉద్యమాలకు దూరంగా ఉన్నవారిని టీఆర్ఎస్లోనికి తీసుకుని వారికి పదవులు ఇవ్వటంతో ఆ పార్టీలోని అసలు క్యాడర్, నేతలలో అసంతృప్తి రగిలిపోతోందని చెప్పారు. రాజ్యాంగవిరుద్ధంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవటమేకాకుండా మంత్రిపదవికూడా ఇవ్వటం ఎక్కడా లేదని అన్నారు. ఈ పరిణామాలన్నిటితో టీఆర్ఎస్లో అసంతృప్తి పెరిగిపోతోందని, దీని ప్రభావం త్వరలో కనబడనుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సొంత నియోజకవర్గాలలో గెలవలేని నాయకులు కాంగ్రెస్ పార్టీనుంచి వెళ్ళిపోవటంవల్ల నష్టం లేదని పరోక్షంగా డీఎస్నుద్దేశించి వ్యాఖ్యానించారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నామని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణలో పరిస్థితులను అధినేత్రి సోనియాకు వివరించామని, సభ్యత్వ నమోదు పెంచమని ఆమె ఆదేశించారని తెలిపారు.