దేశ రాజకీయాల్లో ఇదో ప్రత్యేకమైన సందర్భం అని చెప్పొచ్చు. ఎస్పీ, బీఎస్పీలు ఉత్తరప్రదేశ్ లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ అఖిలేష్ యాదవ్, మాయావతిలు కలిసి సభలు నిర్వహించారు. కానీ, ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్, మాయావతి పాతికేళ్ల తరువాత ఒకే వేదికపైకి రావడం ఇదే ప్రథమం. మైన్ పూర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభకు ములాయం వచ్చారు. వేదికపై మాయావతిని మధ్యలో కూర్చోబెట్టుకుని, అటూ ఇటూ ములాయం, అఖిలేష్ లు కూర్చోవడం గమనార్హం. ఈ ఇద్దరూ ఒక్కసారిగా వేదిక మీదికి వచ్చేసరికి… సభా ప్రాంగణమంతా కాసేపు హోరెత్తింది. ఎప్పుడో, 1995లో మాయావతితోపాటు ఆమె పార్టీకి చెందినవారిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో ఎస్పీ, బీఎస్పీల మధ్య రాజకీయ వైరం ప్రారంభమైంది. అది ఇన్నాళ్లకు ఫుల్ స్టాప్ పడింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకోవాలి. యూపీలో ఎస్పీ, బీఎస్పీ అధినేతలు ఒక వేదిక మీదికి వచ్చేసరికి… ఆహా, ఎంతటి అద్భుతమైన దృశ్యం, పెద్ద మనసుతో శత్రుత్వాలని పక్కనపెట్టేశారు, కొత్త రాజకీయాలకు తెర తీస్తున్నారు అని ఇప్పుడు చాలామంది మెచ్చుకుంటున్నారు. మరీ…. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ లు కలిస్తే, అదేదో అపవిత్ర పొత్తు అని గొంతులు చించుకునేవారంతా ఇప్పుడెందుకు స్పందించరు? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకే వేదిక మీదికి రాగానే… అతిగా స్పందించేసిన కొన్ని మీడియా సంస్థలు, మాయవతి ములాయం కలియికని ఆదర్శప్రాయంగా చూపే ప్రయత్నిస్తున్నాయి!
దేశం మారుతోంది, తరం మారుతోంది, రాజకీయాలు కూడా మారాలి. ఆ మార్పునకు ఇది సంధి కాలం. రాజకీయ పార్టీల ఆలోచనా విధానాలు మారుతున్నాయి. ప్రజల అవసరాలు మారుతున్నాయి. రాజకీయ పార్టీల గత చరిత్రలు, పునాదుల్లో కుళ్లుకుపోయి ఉన్న వైరాలు ఈ తరానికి అవసరం లేదు. ఫలానా పార్టీ పుట్టినప్పుడు, ఫలానా వారిని వ్యతిరేకించారు కదా… ఆ వ్యతిరేకత నుంచే పార్టీ పుట్టింది కదా, దాన్ని కూడా వారసత్వం మోసుకుంటూ రావాలి కదా అనే చర్చలకు కాలం చెల్లింది. దానికి ఉదాహరణే యూపీలో ఇప్పుడు ఆవిష్కృతమైన దృశ్యం. అక్కడి ప్రజలు ఈ రెండు పార్టీల కలయికను ఒక రాజకీయ అవసరంగా చూస్తున్నారు ఆదరిస్తున్నారు. కానీ, మన రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ లు కలవడమేంటనే ధోరణిలోనే నిన్నమొన్నటి ఎన్నికల ప్రచారాల్లో కూడా తీవ్ర విమర్శలు చేస్తూనే వచ్చారు. రాష్ట్రంలో మరో పార్టీకి చోటివ్వకూడదన్న లక్ష్యం యూపీలో వారికి ఒకటి చేసిందని గొప్పగా ఇవాళ్ల చాలామంది విశ్లేషిస్తున్నారు. మరి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉన్నామని మాటిస్తే, వారితో టీడీపీ చేతులు కలిపితే దీన్ని ఏదో తప్పులా విమర్శించినవారు ఇప్పుడేమంటారు..? బద్ధ శత్రువులు యూపీలో కలిస్తే ఆదర్శప్రాయం, ఏపీలో కలిస్తే అపవిత్రమా..?