టీఆర్ఎస్ ఎంపీలు ఫ్లెక్సీలు పెడితే ఎవరు అందులో ప్రధానంగా ఉంటారు..? ఇంకెవరు కేసీఆర్..లేకపోతే కేటీఆర్. కానీ టీఆర్ఎస్ తరపున కొత్తగా ఎంపీగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రకు కేసీఆర్ కన్నా.. కేటీఆర్ కన్నా పవన్ కల్యాణ్, చిరంజీవే ఎక్కువ అయ్యారు. అంతే కాదు కొన్ని ఫ్లెక్సీల్లో వంగవీటి రంగాను కూడా పెట్టుకున్నారు. ఎందుకు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సి నపని లేదు.. వాళ్లంతా ఒకే సామాజికవర్గం అని. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన రవిచంద్ర.. తన అనుచరులతో అలాంటి ఫ్లెక్సీలు ఖమ్మం మొత్తం వేయించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికయిన వద్దిరాజు రవిచంద్ర చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఖమ్మం అంతా పెట్టించారు. వద్దిరాజు రవిచంద్ర, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారదిరెడ్డిలు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఖమ్మం నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు స్వాగతంతోపాటు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. దీంతో రెండు రోజులుగా వద్దిరాజు అనుచరులు ఫ్లెక్సీలు పెడుతున్నారు. అందులోనే పవన్, చిరంజీవి హైలెట్ అయ్యారు.
అయితే అందులో టీఆర్ఎస్ పార్టీకి చెందిన అగ్రనేతల ఫోటోలు కూడా లేవు. కేవలం సామాజిక వర్గానికి చెందిన నాయకుల ఫోటోలు ఉండటంతో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలనే ఉద్దేశ్యంతో ఈ ప్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగిందనేది వినిపిస్తుంది. తమ పార్టీ నుంచి ఎన్నికైన నాయకుడికి వేరే పార్టీలలో ఉన్న నాయకుల ఫోటోలతో కలిపి ప్లెక్సీలు ఏర్పాటు చేయడం టీఆర్ఎస్లోనూ చర్చనీయాంశమవుతోంది. వద్దిరాజుకు రెండేళ్ల పదవి కాలం ఉన్న రాజ్యసభ సీటే లభించింది. దానికే ఆయన ఎంపీగా ప్రమాణం చేయడానికి ఖమ్మం నుంచి నాలుగు వందల మందిని ఢిల్లీ తీసుకెళ్లారు. తిరిగి వచ్చాక హంగామా చేస్తున్నారు.