ప్రేక్షకులు సినిమాని చూసే ద్రుష్టి మారింది. మంచి కంటెంట్ వున్న సినిమాలనే ఆదరిస్తున్న సమయమిది. అయితే కొంతమంది హీరోలు మాత్రం సినిమాని చూసే ద్రుష్టి మార్చుకోలేదు. రెండు సినిమాల తర్వాత మాస్ లీగ్ లో చేరుపోవాలనే తాపత్రయం యువ హీరోల్లో కనిపిస్తోంది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా ‘ఆదికేశవ’తో మాస్ అవాతర్ లోకి మారిపోవాలనే ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
టైటిల్, భారీ యాక్షన్ వున్న గ్లింప్స్, కొడితే గాల్లో గింగిరాలు తిరిగే విలన్లు.. ఇలా అన్నీ వీర మాస్ ఎలిమెంట్స్ ఆదికేశవని తయారు చేశారు. ఈ గ్లింప్స్ ఎలా వుందనే మాట పక్కనపెడితే.. అప్పుడే వైష్ణవ్ తేజ్ కి ఇంత మాస్ ఎలివేషన్ ఎందుకనే మాట అయితే వినిపిస్తోంది.
ఇప్పటివరకూ మూడు సినిమాలే చేశాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన మంచి ప్రేమకథ. దానితో వైష్ణవ్ తేజ్ కి ఒక ఇమేజ్ వచ్చింది. అయితే దాన్ని కొనసాగించడంలో రెండు పరాజయాలు వచ్చాయి. అయితే ఇప్పుడు టోటల్ గా యూటర్న్ తీసుకొని మాస్ మూలవిరాట్ లాంటి ఓ పాత్రలో కనిపిస్తున్నాడు వైష్ణవ్ తేజ్.
మాస్ ఇమేజ్ అనేది సహజంగా రావాలి. బలవంతంగా మాస్ పాత్రల్లోకి దూరితే ఎలాంటి ఫలితాలు వస్తాయో.. నితిన్, అఖిల్, శర్వానంద్.. ఇలా చాలా మంది యంగ్ హీరోల మాస్ సినిమాలు పాఠాలుగా కనిపిస్తాయి.
సహజంగా మాస్ ఇమేజ్ ని సహజంగా ఎలా తెచ్చుకోవాలో వైష్ణవ్ తేజ్ ఇంట్లోనే మంచి ఉదాహరణలు కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ ఆరంభంలో అక్కడమ్మాయి, ఇక్కడబ్బాయి, తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి లాంటి ప్రేమకథలు చేశారు తప్పితే సడన్ గా గబ్బర్ సింగ్ అయిపోలేదు. వయసు, ఇమేజ్ కి తగ్గ పాత్రలు చేసుకుంటూ వెళితే ప్రేక్షకులే మాస్ ఇమేజ్ ఇస్తారనే సంగతి వైష్ణవ్ తేజ్ నే కాదు.. యంగ్ హీరోలందరూ గుర్తుపెట్టుకొని పాత్రలు, కథలు ఎంచుకోవడం మంచిది.