వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంగవీటి రాధాకృష్ణ అలా రాజీనామా చేశారన్న విషయం బయటకు రాగానే.. ఆయన టీడీపీలో చేరుతారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ నెల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగున ఆయన చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకుంటారని బెజవాడలో గుప్పుమంది. అయితే.. దీనిపై… వంగవీటి రాధాకృష్ణ ఏ మాత్రం స్పందించడం లేదు. మీడియా ప్రతినిధులు అడిగినా… ఖండించలేదు. రెండు రోజుల్లో తన కార్యాచరణ ప్రకటిస్తానని మాత్రం చెప్పుకొచ్చారు. అంటే.. నిప్పులేనిదే పొగ రాదన్నట్లుగా వ్యవహరం ఉందన్న విషయం స్పష్టమవుతోంది.
నిజానికి .. వంగవీటి రాధాకృష్ణ.. తన తండ్రి 30వ వర్థంతి రోజునే.. వైసీపీకి రాజీనామా చేద్దామనుకున్నారు. కానీ.. అప్పట్లో ఆప్తమిత్రుడు కొడాలి నాని.. వైసీపీ తరపున వచ్చి.. ఎలాంటి ప్రకటనలు చేయకుండా.. ఆపగలిగారు. కానీ… ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ… వైసీపీ వైపు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో.. ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో.. ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై చర్చలు జరిపారని.. ఏ పార్టీలో చేరాలో కూడా నిర్ణయం తీసుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తీరాలన్న లక్ష్యంతో.. ఉన్న వంగవీటి రాధాకృష్ణ.. దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతనే వైసీపీకి రాజీనామా చేశారంటున్నారు. రాధాకృష్ణకు మద్దతుగా… విజయవాడ నగరంలో దాదాపుగా ఆరుగురు కార్పొరేటర్లు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు.
గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న ప్రచారం కూడా సాగింది. అప్పట్లో ఖండించారు. వంగవీటి రంగాను.. గౌతం రెడ్డి దూషించినప్పుడు కూడా.. అలాంటి ప్రచారమే జరిగింది. అయినప్పటికీ.. ఆయన తొందర పడలేదు. ఇప్పుడు మరోసారి అదే తరహా ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధాకృష్ణ.. వ్యక్తిగతంగా మంచి మిత్రులు. వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నప్పటికీ.. మిగతా ఇద్దరూ వైసీపీలో ఉన్నారు. వల్లభనేని వంశీ ద్వారా… టీడీపీలోకి వచ్చేందుకు రాధాకృష్ణ ప్రయత్నాలు చేశారని గతంలోనే చెప్పుకొచ్చారు. సహజంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాంటి స్టేచర్ ఉన్న లీడర్లకు ప్రాధాన్యం ఇస్తారు. వంగవీటి ఏ మాత్రం ఆసక్తి చూపినా పార్టీలోకి తీసుకుంటారు. ఆ తర్వాత తనదైన శైలిలో ఆయన ఉపయోగించుకుంటారు. అయితే ఎమ్మెల్సీ ఇస్తారని.. దానికే వంగవీటి అంగీకరించారని.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ.. వంగవీటి లాంటి నేతను.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం చేసే వ్యూహాలను చంద్రబాబు ఎప్పుడూ అమలు చేయరు. టీడీపీలో చేరితే.. పోటీ ఖాయమే.. అది ఎక్కడి నుంచి అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది..!