ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలలే ఉండగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైస్సార్సీపీ కీలక నేత వంగవీటి రాధా వైయస్సార్సీపి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఇవాళ వంగవీటి రాధా పార్టీ అధినేత జగన్ కు పంపించారు.
ఈ లేఖలో వంగవీటి రాధా, తనది ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే మనస్తత్వం కాదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం న్యాయ సంరక్షణ కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని, దమనకాండకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని వంగవీటి రాధా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మీద కూడా వంగవీటి రాధా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కావాలనే మీ కాంక్ష నెరవేర్చుకోవడం కోసం మీరు పార్టీలోని అందరి మీద ఆంక్షలు విధిస్తున్నారు. అయితే నా కాంక్ష నెరవేరాలంటే ఎటువంటి ఆంక్షలు లేని పార్టీలో చేరాల్సి ఉంది అంటూ వంగవీటి రాధా చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
వంగవీటి రాధా 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయవాడ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు కానీ అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయ్యాక వైఎస్ఆర్ సీపీలో చేరారు కానీ మళ్లీ ఎమ్మెల్యే గా ఎన్నిక కాలేకపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ సీపీని వీడిన తర్వాత ఏ పార్టీలో చేరుతారనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది.