ఒకప్పుడు హీరోయిన్లుగా వెండితెరపై పోటీపడిన హీరోయిన్లు రోజా, వాణి విశ్వనాథ్ ఇప్పుడు రాజకీయాల్లో పోటీ పడాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగుతో అనుబంధం ఉన్న తమిళ్ కుటుంబానికి చెందిన వాణి విశ్వనాథ్ హఠాత్తుగా నగరి నియోజకవర్గంలో ప్రత్యక్షమయ్యారు. కొందరు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు. మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమని… నగరి నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. నగరిలో ఉన్న తమిళులు ఎంతో ఆదరిస్తున్నారని… అంటున్నారు.
వాణి విశ్వనాథ్ ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు. పోటీ చేస్తాను కానీ ఏ పార్టీ అనేది చెప్పలేనంటున్నారు. అంతే కాదు… ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే.. తాను ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానంటున్నారు. అయితే వాణి విశ్వనాథ్ ఇలా రాజకీయ ప్రకటనలు చేయడంఇదే మొదటిసారి కాదు. గతంలో రోజాకు పోటీగా వాణి విశ్వనాథ్ అభ్యర్థిత్వాన్ని టీడీపీ పరిశీలించింది. ఆమెను టీడీపీలో చేర్చుకునే ఉద్దేశంతో రెండు సార్లు విజయవాడకు పిలిపించారు. కానీ చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు., అప్పట్లో ఆమె టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. తర్వాత సైలెంటయ్యారు.
ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో వాణి విశ్వనాథ్ ఈసారి నేరుగా నగరిలోకి రంగంలోకి దిగారు. నగరిలో పర్యటించడం ప్రారంభించారు. అయితే ఆమె వెనుక టీడీపీ ఉందా లేదా అన్నదానిపై స్పష్టతలేదు. ప్రస్తుతం గాలి ముద్దు కృష్ణనాయుడు కుమారుడు టీడీపీ నగరి ఇంచార్జ్‌గా ఉన్నారు. ఆయనే పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. నగరి నియోజకవర్గంలో ఉన్న తమిళ ఓట్లతో రోజా బయటపడుతున్నారు.. అందుకే ఈ సారి తమిళ పాచిక వేయాలని టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.