మంచి కథల్ని, మారుతున్న ప్రేక్షకుల అభిరుచినీ వర్మ పట్టుకోవడం లేదు గానీ, సినిమాని అమ్ముకునే కళ మాత్రం బాగానే అబ్బింది. నిన్నటికి నిన్న `ఆర్జీవీ వరల్డ్ థియేటర్స్`లో `క్లైమాక్స్` సినిమాని విడుదల చేశాడు. పే ఫర్ వ్యూ పద్ధతిన ఈ సినిమా చూడొచ్చు. టికెట్ ధర వంద రూపాయలు. ఈ సినిమా ద్వారా ఇప్పటి వరకూ 3 కోట్ల రూపాయలు వచ్చాయని ఓటీటీ సంస్థ ప్రకటించింది. నిజానికి ఇదో పెద్ద జిమ్మిక్కు. రూ.3 కోట్లు వచ్చాయని చెప్పుకోవడం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. కాకపోతే.. దీనికి కాస్త రీజనబుల్ వ్యూస్ వచ్చాయనే చెప్పుకోవాలి. కనీసం ఈ పద్ధతి ద్వారా రూ.1 కోటి సంపాదించినా.. గొప్ప ఆర్జనే అనుకోవాలి.
థియేటర్ అద్దెలు లేవు. పబ్లిసిటీ పోస్టర్లు లేవు. సినిమా మేకింగ్ పై ఖర్చు పెడితే చాలు. ఇంటి పట్టునే కూర్చుని వంద రూపాయలతో ఫ్యామిలీ మొత్తం చూసేలా సినిమాలు తీస్తే.. తప్పకుండా ఆదరణ ఉంటుందని వర్మ `క్లైమాక్స్`తో నిరూపించాడు. వర్మ నుంచి వచ్చింది చెత్త ప్రొడక్టే కావొచ్చు. కాకపోతే… మంచి కథల్ని నమ్ముకున్న దర్శకులకు, నిర్మాతలకూ `పే ఫర్ వ్యూ` పద్ధతి లాభాల్ని తీసుకొస్తుందన్న నమ్మకం మాత్రం కల్పించాడు. కాకపోతే… శుభప్రదంగా `క్లైమాక్స్`లాంటి సినిమాలు చూడాల్సిరావడమే దురదృష్టం. ఓ మంచి సినిమాని ఈ రకంగా జనాల్లోకి తీసుకెళ్తే మాత్రం కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఇది థియేటర్లకు మరో ప్రత్యామ్నాయ మార్గం కచ్చితంగా అవుతుంది.