మెగా హీరోల్లో వరుణ్ తేజ్ స్టైల్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అందరిలా మాస్ సినిమాల్ని ఎంచుకోవడం లేదు. సెన్పిబుల్ కథలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందుకే ముకుంద, కంచెలాంటి సినిమాలు తన ఖాతాలో చేరాయి. అన్నట్టు.. వరుణ్ మెల్లమెల్లగా అభిమాన గణాన్ని పెంచుకొంటున్నాడు. ఫ్యాన్స్ కోసం ఆలోచిస్తున్నాడు. దానికి తగ్గట్టే ‘మెగా ప్రిన్స్’ అంటూ అభిమానులు కూడా తమ హీరోని ముద్దుగా పిలుచుకొంటున్నారు. అయితే ఇలా ప్రత్యేకంగా ఓ బిరుదుతో పిలవడం కాస్త ఇబ్బందిగా ఉంటోందంటున్నాడు వరుణ్. ”అభిమానులు ఎలా పిలిచినా ఫర్వాలేదు. కానీ మెగాప్రిన్స్ అంటే ఇబ్బందిగా ఉంటోంది. మా తరం కథానాయకులు ఇలాంటి బిరుదులకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటివాళ్లకు కూడా బిరుదులు ఉన్నాయి. కానీ.. వాళ్లేం వాటిని తమ పబ్లిసిటీలో వాడుకోరు. మనం ఎందుకు వాడుకోవాలి” అంటున్నాడు.
ఒక్క సినిమా కూడా చేయకుండా ‘మాకేం బిరుదులు ఇస్తారా’ అని ఎదురుచూసే హీరోలున్న ఈ తరుణంలో.. వరుణ్ తేజ్ ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగానే ఉంది. వరుణ్ నటించిన ‘మిస్టర్’ ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సినిమాపై చాలా అశలే పెంచుకొన్నాడు వరుణ్ ఇందులో తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉండబోతున్నాయట. ”శ్రీనువైట్ల గారి గత సినిమాలకంటే `మిస్టర్` చాలా కొత్తగా ఉంటుంది. ఆయన తన తొలి రోజల్లో ‘ఆనందం’లాంటి అందమైన ప్రేమ కథ తీశారు. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి ఓ లవ్ స్టోరీ చెప్పబోతున్నారు. ఈసినిమా తప్పకుండా మా అందరి అంచనాల్నీ నిజం చేస్తుంది” అంటున్నాడు వరుణ్. శేఖర్ కమ్ములతో తీసిన ‘ఫిదా’ కూడా షూటింగ్ పూర్తయిపోయిందట. త్వరలోనే ఈ సినిమానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.