ఎన్టీఆర్ పక్కన కథానాయికగా వీణారావుని ఎంచుకొన్నారు. అయితే ఈ ఎన్టీఆర్ అంటే… యంగ్ టైగర్ కాదు. మరో ఎన్టీఆర్. నందమూరి కుటుంబం నుంచి వస్తున్న నాలుగోతరం కథానాయకుడు. నందమూరి జానకీరామ్ తనయుడు ఎన్టీఆర్‌ని హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఓ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా ఓ అచ్చ తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తానని వైవీఎస్ చౌదరి ఇది వరకే చెప్పారు. ఇప్పుడు వీణారావుని కథానాయికగా ఎంచుకొన్నట్టు ప్రకటించారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తారు. చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూరుస్తారు. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ ని డైలాగ్ రైటర్‌గా ఎంచుకొన్నారు.
వైవీఎస్ చౌదరిపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రభావం చాలా ఉంది. రాఘవేంద్రరావు శిష్యుడు కాబట్టి, కథానాయికల్ని బాగా చూపిస్తారు. వైవీఎస్ చౌదరి పరిచయం చేసిన కథానాయికలు తెలుగు సినిమాపై తమదైన ముద్ర వేశారు. అందులో ఇలియానా పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. `దేవదాస్`తో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తరవాత టాలీవుడ్ లో అగ్రగామిగా ఎదిగింది. స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసింది. ఇప్పుడు వీణా రావు సైతం తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టబోతోందని వైవీఎస్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ అమ్మాయికి క్లాసికల్ డాన్స్ తో కూడా పరిచయం ఉంది. తెరపై ఈ అమ్మాయిని వైవీఎస్ చౌదరి ఎంత అందంగా చూపిస్తారన్నది కొద్ది రోజులు ఆగితే తెలుస్తోంది. అచ్చమైన కథతో తీస్తున్న సినిమా ఇదని, మంచి సంగీతం, సాహిత్యం ఉంటాయని, రోమాంఛిత సన్నివేశాలూ కనిపిస్తాయని చెప్పుకొచ్చారు వైవీఎస్. త్వరలోనే ఎన్టీఆర్ – వీణారావులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి అభిమానులకు పరిచయం చేయనున్నారు.