కొన్నిసార్లు ప్రచారంలో చెప్పే మాటలు కూడా సినిమాపై ఆసక్తిని పెంచేస్తాయి. నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘వీరాంజనేయులు విహారయాత్ర’ ఇలానే ద్రుష్టిని ఆకర్షించింది. ఈ సినిమాని ఏకంగా ‘శ్రీవారికి ప్రేమలేఖ’ తో పోల్చారు నరేష్. ఇది పెద్ద మాటే. కంటెంట్ బావుంటే చిన్న సినిమా కూడా అద్భుతం చేయొచ్చని నిరూపించిన సినిమాల్లో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన శ్రీవారికి ప్రేమలేఖ ముందు వరుసలో వుంటుంది. మరి ‘వీరాంజనేయులు విహారయాత్ర’ ‘ఈటీవిన్’ కి అంతటి మంచి సినిమా వరుసలో చేరిందా? ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రోడ్ ట్రిప్ లో మనసుని హత్తుకున్న భావోద్వేగాలు ఏమిటి?
వీరాంజనేయులు (బ్రహ్మానందం) ఓ రైల్వే ఉద్యోగి. తన రిటైర్మెంట్ డబ్బుతో గోవాలో ఓ ఇల్లు కొంటాడు. దానికి ‘హ్యాపీహోం అని పేరు పెడతాడు. సెలవుల్లో వైజాగ్ నుంచి ఫ్యామిలీని తన కార్ లో ‘హ్యాపీహోం’కు తీసుకెళ్ళి అక్కడ సరదాగా గడిపి వస్తుంటారు. ఆ కుటుంబానికి ‘హ్యాపీహోం’ ఓ అందమైన అనుభవం. వీరాంజనేయులు మరణానంతరం ఆ ఇంటి బాధ్యత కొడుకు నాగేశ్వరరావు (నరేశ్)పై పడుతుంది. తను వైజాగ్లో ఓ ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్. నాగేశ్వరరావు కొడుకు వీరు (రాగ్ మయూర్). తనో గేమ్ డెవలపర్. కుమార్తె సరయు (ప్రియా వడ్లమాని). సరయు ప్రేమించిన కుర్రాడితోనే పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ పెళ్లి చేయాలంటే కనీసం నలభై లక్షలు కావాలి. ముఫ్ఫై వేల జీతానికి పని చేసే నాగేశ్వరరావు కి అంత ఆర్ధిక స్తోమత వుండదు. కొన్ని కారణాల వలన వున్న ఉద్యోగం కూడా పోతుంది. సరిగ్గా అదే సమయంలో హ్యాపీహోం అమ్మితే రూ.60లక్షలు ఇస్తామని ఓ ఆఫర్ వస్తుంది. అయితే ఆ ఇల్లు అమ్మకంలో ఓ లిటిగేషన్ వుంది. ఆ ఇల్లు ఫ్యామిలీలోని అందరిపేర్ల పై వుంటుంది. అమ్మాలంటే అందరి సంతకం కావాలి. దీంతో తండ్రి వీరాంజనేయులు అస్థికలు గోవా బీచ్ లో కలపాలనే నెపంతో నాగేశ్వరరావు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని కారులో గోవాకు పయనమవుతాడు. మరి ఈ జర్నీ ఎలా సాగింది? నాగేశ్వరరావు కుటుంబానికి నిజం తెలిసిందా? సరయు పెళ్లి జరిగిందా? ఈ విహారయాత్రలో ఆ కుటుంబం ఎదురుకున్న అనుభవాలు ఏమిటి? ఇదంతా మిగతా కథ.
ఇదొక మధ్యతరగతి దాగుడు మూతలు లాంటి కథ. ఉద్యోగం పోయిందని ఇంట్లో చెప్పని తండ్రి, కోడలి మీద ప్రేమ బయటికి చూపించని అత్త, ప్రేమ సంగతి తమ్ముడితో చెప్పని అక్క, తన లక్ష్యం కోసం ఉద్యోగం మానేసిన తమ్ముడు.. దాదాపు అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఇలాంటి మెలోడీసే వుంటాయి. ఇలా ప్రతి ఒక్కరూ రిలేట్ అయిన ఎలిమెంట్స్ నే తీసుకొని, తెలిసిన కథనే కాస్త ఫ్రెష్ గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు అనురాగ్. ఈ ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు.
వీరాంజనేయులు వాయిస్ తో కథని ప్రారంభించిన విధానం, పాత్రల పరిచయం చకచక సాగిపోతాయి. కాసేపటికే కథలో సంఘర్షణ కూడా మొదలైపోతుంది. ఫ్యామిలీ అంతా రోడ్ ట్రిప్ కి స్టార్ట్ అయిన తర్వాత ప్రధాన పాత్రల్లో ఒకొక్క బ్యాక్ స్టొరీని, క్యారెక్టర్స్ లోని చిన్న సీక్రెట్స్ ని క్రమంగా బిల్డ్ చేసుకుని వెళ్లిన విధానం బావుంది. ప్రతి పాత్రకు ఒకొక్క సీక్రెట్ వుంటుంది. అవన్నీ ఒక చోట పేలుతాయని ప్రేక్షకుడు ముందే ఊహిస్తాడు. విరామంలో ఆ సందర్భం వస్తుంది. ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య వచ్చే సంఘర్షణ బాగానే కుదిరింది.
విరామం తర్వాత వచ్చే హాస్పిటల్ సీక్వెన్స్ సుదీర్గంగా సాగుతుంది. అది కాస్త పదునుగా తీయల్సింది. అయితే ఆ సీక్వెన్స్ తో పోలీస్ స్టేషన్ కి ముడిపెడుతూ ఇంకో కీలకమైన పాయింట్ అల్లుకున్నారు. ఇక్కడ బయటపడిన అసలు సీక్రెట్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్స్ ని చాలా సహజంగా చూపించారు. అప్పటివరకూ కోడలి మీద చిర్రుబుర్రులాడే ఆత్త ఒక్కసారి కోడలిపై తనకున్న ప్రేమని వ్యక్తం చేసిన తీరు మనసుని హత్తుకునేలా వుంటుంది. ఈ సీక్వెన్స్ ని చాలా పరిణితితో తీశాడు దర్శకుడు. ఇక క్లైమాక్స్ కి ముందు ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ తన కుటుంబం గురించి ఎంత కష్టపడతాడో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. చివరికి ఎమోషనల్ నోట్ తో కథని ముగించిన విధానం బావుంది.
నరేష్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. అయితే ఈ కథకు నరేష్ లాంటి నటుడు దొరకడం దర్శకుడి అదృష్టమనే చెప్పాలి. సీన్ పాతదైనా దానికి కొత్తదనం తీసుకురావడంలో నటుడి పాత్ర చాలా వుంటుంది. ఈ సినిమాకు నరేష్ నటన ఆ కొత్తదనం తీసుకొచ్చింది. సినిమా మొత్తం చాలా కంపోజ్డ్ గా కనిపించారాయన. బేసిగ్గా మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే కాస్త చాదస్తంగా చూపిస్తుంటారు. కానీ ఇందులో నరేష్ పాత్ర అందుకు భిన్నంగా వుంటుంది. పిల్లల బాగు కోసం ఎంతటి పరిస్థితినైనా చెక్కుచెదరకుండా ఎదుర్కునే తండ్రిగా కనిపిస్తాడు. నరేష్ కెరీర్ లో ఇది ఒక మంచి రోల్. రాగ్ మయూర్ లో మంచి ఎమోషనల్ నటుడు కూడా వున్నారు. వీరు పాత్రలో ఒదిగిపోయాడు. ప్రియా వడ్లమాని సహజంగా కనిపించింది. బామ్మ పాత్రలో చేసిన శ్రీలక్ష్మీ అనుభవం ఈ పాత్రకు చాలా ప్లస్ అయ్యింది. అమ్మ పాత్రలో చేసిన ప్రియదర్శిని ఆ పాత్రకు సరిగ్గా నప్పింది. మిగతా నటులు కథ మేరకు కనిపించారు.
టెక్నికల్ గా సినిమా డీసెంట్ గా వుంది. నేపధ్య సంగీతం, పాటలు ఆహ్లాదకరంగా వున్నాయి. మొత్తం అవుట్ డోర్ కావడంతో విజువల్స్ సహజసిద్ధంగా కనిపించాయి. మాటలు బావున్నాయి. దర్శకుడు అనురాగ్ లో మంచి కథకుడు వున్నాడు. ఇందులో దాదాపు పాత్రలకు సరైన ముగింపు వుంటుంది. చివరికి హ్యాపీహోం ని కూడా కథలో ఒక పాత్ర చేయడం బావుంది. ఆ ఇల్లే ఈ కథకు ఒక ఎమోషనల్ ఎండింగ్ తీసుకొచ్చింది. మొత్తానికి ఈ వీరాంజనేయులు.. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ లాంటి ఎవర్ గ్రీన్ కాకపోవచ్చు. కానీ ఒకసారి ఫ్యామిలీతో కలసి హాయిగా చూడదగ్గ సినిమా.