చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో ఒకేసారి సినిమాలు నిర్మించి, ఒక్కరోజు గ్యాప్ లో రెండు సినిమాలూ విడుదల చేసిన ట్రాక్ రికార్డ్ మైత్రీ మూవీ మేకర్స్ కి దక్కింది. బాలకృష్ణ వీరసింహరెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య.. ఈ రెండు 2023 సంక్రాంతి సినిమాలుగా బాక్సాఫీసు ముందుకు వచ్చాయి. ఇలా రెండు భారీ సినిమాలని, అభిమానులు అంచనాలున్న మాస్ సినిమాలని ఒకేసారి విడుదల చేయడం మాటలు కాదు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు చాలా నేర్పుతో ఇద్దరు హీరోలని, వారి అభిమానులు అంచనాలకు తగ్గట్టుగా సినిమాని ముస్తాబు చేసి విడుదల చేశారు. ప్రమోషన్స్ ని తూకంలో తూచినట్లు బ్యాలన్స్ చేశారు. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా ఎక్కడా తక్కువ, ఎక్కువ చేయలేదు. రెండు సినిమాలకు సక్సెస్ మీట్లు పెట్టారు. ఈ రెండు సినిమాలు కూడా సదరు హీరోల కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్, హయ్యస్ట్ రికార్డ్స్ కలెక్ట్ చేశాయని చెప్పారు. అక్కడితో అయిపొయింది.
పుష్ప 2 బిజీగా వున్న మైత్రీ మూవీ మేకర్స్ కి ఇప్పుడు సడన్ గా బాలకృష్ణ వీరసింహరెడ్డి సినిమా గుర్తుకు వచ్చింది. బాలకృష్ణ పుట్టిన రోజున వీరసింహరెడ్డి వందరోజుల పండగ చేశారు. టీమ్ లో అందరికీ వందరోజుల షీల్డ్స్ ఇచ్చారు. డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా పిలిచి ఒకొక్క షీల్డ్ చేతిలో పెట్టారు. వీరసింహరెడ్డి వీరమాస్ బ్లాక్ బస్టర్ అని గొప్పగా ప్రటించారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు చేసిన ఈ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదం రాజేసింది. ‘వాల్తేరు వీరయ్య’కి వందరోజుల వేడుక లేదా ? అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ మైత్రీ మూవీ మేకర్స్ ని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు వందరోజులు ఆడిన థియేటర్ల లిస్టు పెట్టమని అడుగుతున్నారు. వందరోజులు అయిపోయి నెలలు దాటిపోయింది కదా ? ఇప్పుడేంటి వంద రోజులు పండగ ? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే నిర్మాతల సామజిక వర్గానికి కూడా ముడిపెడుతూ.. కావాలనే వాల్తేరు వీరయ్యని తక్కువ చేశారని తోచిన కామెంట్లు పెడుతున్నారు.
నిజానికి వీరసింహారెడ్డి వందరోజుల వేడుక.. మీడియా వర్గాలకు కూడా ఆశ్చర్యపరిచింది. గతంలో ఈ వేడుక చేస్తామని నిర్మాతలు ఒక పోస్టర్ వదిలారు. కానీ అదే సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ పై ఐటీ దాడులు జరిగాయి. దీంతో ఆ వేడుక లేకుండా పోయింది. దాన్ని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు జరిగిన వేడుకలో కూడా అభిమానులు సందడి లేదు. ఏదో ప్రైవేట్ వ్యవహారంలా తేల్చారు.
ఐతే వేడుక ఏదైనా.. వంద రోజులు.. వంద రోజులే. ఆ షీల్డ్ ఒక జ్ఞాపకం. ఆ ఫోటో అభిమానులకు ఒక సందడి. వందరోజుల వీరసింహారెడ్డి అని షోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు షేర్ చేస్తుంటే.. మెగా అభిమానులకు ఎక్కడో చిన్న వెలితి. రెండు సినిమాలు సమానంగా విజయం సాధించాయని నిర్మాతలు చెప్పినపుడు ఈ ఒక్క సినిమాకి వందరోజుల వేడుక ఎందుకు ? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. పైగా వందరోజుల పండగ చేసే సమయం కూడా కాదిది. గతంలో చేసిన షీల్డ్స్ పంచేద్దామనే ఉద్దేశం బాలయ్య పుట్టిన రోజుని ఎంచుకున్నారేమో కానీ.. ఇది ఫ్యాన్ వార్ కి దారితీసింది. మరి మెగా అభిమానులని ఖుషి చేయడానికి మైత్రీ మూవీస్ మేకర్స్ ఏం చేస్తుందో చూడాలి.