ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు వెల్లంపల్లి వారం రోజుల పాటు తిరుమలోనే ఉన్నారు. ఆయన తిరుమల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కరోనా లక్షమాలు బయటపడ్డాయి. దీంతో ఆయన టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ అని తేలడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు వెల్లంపల్లి పాల్గొన్నారు. పైగా ముఖ్యమంత్రి జగన్కు మాస్క్ పెట్టుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. తిరుమలలో ఏ కార్యక్రమంలోనూ ఆయన మాస్క్ పెట్టుకోలేదు. వెల్లంపల్లి మాస్క్ పెట్టుకున్నారు కానీ.. అది గొంతుకు పెట్టుకున్నారు.
అలా పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి వెనుకాల ఉండి కార్యక్రమం మొత్తం నడిపించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా.. తన ఎమ్మెల్యేలకు మాస్క్ పెట్టుకోవద్దనే సూచిస్తున్నారు. రేణిగుంట ఎయిర్పోర్టులో దిగినప్పుడు.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.. కుమార్తెను తీసుకుని స్వాగతం పలకడానికి వచ్చారు. ఆ సమయంలో.. ఫోటో దిగబోతూంటే.. మాస్క్లు తీయాలని జగన్ సూచించారు. దానికి విరగబడిన నవ్విన బియ్యపు మధుసూదన్ మాస్క్ తీసేసి ఫోటో దిగారు. ఈ ఘటన కారణంగా ముఖ్యమంత్రి ఎదుట మాస్క్లు పెట్టుకోవడానికి చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధపడటం లేదు.
తిరుమలకు రోజూ.. ఇరవై వేల మంది వరకూ వస్తున్నారు. ఇలా భారీగా ప్రజలు వచ్చే ప్రదేశాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు లేని కేసుల వల్లే.. ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందుతోందన్న ప్రచారం జరుగుతోంది. వారం రోజుల పాటు తిరుమలలోనే ఉన్న వెల్లంపల్లికి అలాగే సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వెల్లంపల్లితో పాటు ఉన్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకుంటే… ఎంత మందికి సోకిందో తెలిసిపోతుంది.