వైవిధ్యభరితమైన కథలకు కేరాఫ్ అడ్రస్స్ వెంకటేష్. తన తోటి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మాస్ కథలతో ప్రయాణం చేసినప్పుడు కూడా వెంకీ తన రూటు మార్చలేదు. కొత్త కథలకు, పాత్రలకు పెద్దపీట వేశారు. అలాగని మాస్ పాత్రలు వదల్లేదు. మల్టీస్టారర్ కథలకు, రీమేకులకూ ఆయన పెట్టింది పేరు. అయితే తాజాగా వెంకీ ఆలోచనల్లో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన కూడా రెగ్యులర్ కమర్షియల్ కథలకే పెద్ద పీట వేస్తున్నారని, కొంతకాలమైనా ప్రయోగాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారని తెలుస్తోంది.
Also Read : ఎక్స్‌క్లూజీవ్: వెంకీతో వేణు ఉడుగుల
వెంకటేష్ నుంచి వచ్చిన ‘సైంధవ్’ పెద్ద ఫ్లాప్‌గా నిలిచిపోయింది. వెంకీ కెరీర్లో మర్చిపోలేని డిజాస్టర్. నిజానికి ఈ సినిమాపై వెంకీ చాలా ఆశలు పెట్టుకొన్నారు. కానీ అంచనాలు పూర్తిగా తప్పాయి. ‘సైంధవ్’ తరవాత ‘దృశ్యం’ తరహాలో కొన్ని ప్రయోగాత్మక కథలు చేయాలనుకొన్నారు. కొన్ని స్క్రిప్టులు కూడా సిద్ధమయ్యాయి. కొత్త దర్శకులు వెంకీ పిలుపు కోసం ఎదురు చూపుల్లో పడ్డారు. కానీ ‘సైంధవ్’ ఎప్పుడైతే తేడా కొట్టిందో, అప్పుడే అలాంటి కథల్ని పక్కన పెట్టేశారు. ప్రయోగాలు చేసి, మరో డిజాస్టర్ ని నెత్తిన చుట్టు కోవడం తనకు ఇష్టం లేదని తన దగ్గరకు వస్తున్న దర్శక నిర్మాతలకు వెంకీ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నార్ట. చేతిలో హిట్ ఉన్నప్పుడు రిస్క్ చేయడానికి ధైర్యం వస్తుంది. అదే ఫ్లాప్ ఉంటే, మరింత జాగ్రత్త పడిపోతారు. వెంకీ ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నారు. అనిల్ ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తను ఇప్పటి వరకూ ఫ్లాపన్నది తీయలేదు. మినిమం గ్యారెంటీ ఉండే కథలే పట్టాలెక్కిస్తాడు. అందుకే వెంకీ కూడా రిస్క్ తీసుకోకుండా, అనిల్ రావిపూడి ని గుడ్డిగా ఫాలో అయిపోవాలని డిసైడ్ అయ్యారు. పైగా ఈ సినిమా సంక్రాంతికి వస్తోంది. సంక్రాంతి సినిమా అంటే.. మరింత భరోసా. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ సినిమాని ఆడుతూ పాడుతూ పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. ఒకట్రెండు వరుస విజయాలు వస్తే కానీ, పాత వెంకీని చూడలేమేమో..?