‘చిరంజీవితో ఓ సినిమా చేయాలని ఉంది’ అంటూ ఇటీవల వెంకటేష్ తన మనసులో మాట బయటపెట్టారు. ఆ సందర్భంలో పక్కనే ఉన్న చిరంజీవి కూడా ‘ఓ..ఎస్’ అంటూ చేయి కలిపారు. అలా చిరు – వెంకీల మల్టీస్టారర్ ప్రస్తావన బయటకు వచ్చింది. ప్రెస్ మీట్లలో, సినిమా ఈవెంట్లలో ఇలాంటి స్టేట్మెంట్లు గుప్పించడం హీరోలకు, దర్శకులకు మామూలే. కానీ వాటిని నిలబెట్టుకొన్న దాఖలాలు చాలా అరుదు. కేవలం సినిమా ప్రమోషన్లకు ఆ కంటెంట్ పనికొస్తుందంతే! ఈసారీ అంతేనా? కేవలం ప్రమోషన్లలో భాగంగానే మాట్లాడారా, నిజంగానే చిరుతో వెంకీకి సినిమా చేయాలని ఉందా? ఈ విషయాలపై ‘సైంధవ్’ ప్రెస్ మీట్ లో మరోసారి క్లారిటీ ఇచ్చారు వెంకీ.
చిరంజీవితో తనకు సినిమా చేయాలని ఉందని, అయితే అదంతా దర్శకులు, రచయితల చేతుల్లో ఉంటుందని, వాళ్లు కథలు తీసుకొస్తే తమకు నటించడానికి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు వెంకటేష్. ఇద్దరు హీరోలు పక్క పక్కనే ఉంటే చూడ్డానికి బాగుంటుందని, ఆ ఉద్దేశంతోనే తాను సినిమా చేస్తానని చెప్పానని క్లారిటీ ఇచ్చారు. నిజానికి వెంకటేష్ మల్టీస్టారర్లకు ఎప్పుడూ సిద్ధమే. ‘గోపాల గోపాల’, ‘సీతమ్మ వాకిట్లో’ వెంక వల్లే సాధ్యమయ్యాయి. చిరంజీవి కూడా ఈమధ్య మల్టీస్టారర్లపై మక్కువ చూపిస్తున్నారు. ‘ఆచార్య’ ఓరకంగా మల్టీస్టారర్ సినిమానే. ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజతో కలిసి స్క్రీన్ పంచుకొన్నారు. హీరోల వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలూ లేవు. అంటే ఇప్పుడు బంతి.. దర్శకుల కోర్టులో ఉందన్నమాట.