సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. వైసీపీ కోసం పని చేసి.. ఆ పార్టీని ఘోరంగా ఓడించడానికి కారణమైన వారిలో ఒకరైన వెంకట్రామిరెడ్డి ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గర కనిపించడం లేదు. సస్పెన్షన్ లో ఉన్నారు కాబట్టి ఆఫీసుకూ రావడం లేదు. ఆయనను బెజవాడ దాటి పోవద్దని ఆదేశాలు ఇచ్చినా… ఎక్కడున్నాడో ఎవరికీ తెలియడం లేదు. కానీ సెక్రటేరియట్ లో ప్రభుత్వానికి తెలియకుండా వస్తున్న జీవోల వెనుక ఆయన ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వం చివరి ఆరు నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అనేక జీవోలు విడుదల కాలేదు. వాటిని కొత్త ప్రభుత్వంలో విడుదల చేయాల్సిన అవసరం లేదు. చేయాలంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. కానీ కొంత మంది అధికారులు ప్రభుత్వ నిర్ణయం అంటూ జీవోలు విడుదల చేసేస్తున్నారు. ఫైనాన్స్ డిపార్టుమెంట్ లో కీలక ఉద్యోగిగా ఉన్న శాంతి కుమారి, లా డిపార్టుమెంట్లో ఉన్న హరి ప్రసాద్ రెడ్డి వంటి వారు ఆయన చెప్పినట్లే చేస్తున్నారు. వైసీపీ ఉన్నప్పుడు వీరిద్దరిది ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా సాగింది.
ఇంకా పలువురు అధికారులతో టచ్ లో ఉండి వెంకట్రామిరెడ్డి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన జీవోలు సైలెంట్ గా వచ్చేలా చేసుకుంటున్నారని అంటున్నారు. టీడీపీ హయాంలోనే ఈ వెంకట్రామిరెడ్డి కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని సాక్షికి లీక్ చేసిన కేసులో సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు సస్పెండ్ అయినా ఇంకా అలాంటి పనులు చేస్తూ.. ఇతర ఉద్యోగుల్ని బలి చేస్తున్నాడన్న సెటైర్లు పడుతున్నాయి.