ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..
నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి…
ఈ వాక్యాలు రాసిన వేటూరి పై బూతు పాట రచయిత అనే ముద్ర వేసింది నాటి సమాజం. ఈ సాహిత్యంలో అంత బూతు ఏం కనిపించింది?! నిజానికి అందులో బూతులేదు. సొగసు, చిలిపిదనం, కొంటెతనం కనిపిస్తుంది. కానీ అసలు సమస్య ఎక్కడంటే.. మహదేవన్ ఇచ్చిన ట్యూను.. దానికి ఎన్టీఆర్, జయప్రద వేసిన స్టెప్పులు, కె రాఘవేంద్రరావు సరసమైన చిత్రీకరణ.. ఇవన్నీ కలసి ఆ పాటకు ఆ ముద్రవేసేలా చేశాయి. ఈ పాట సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ‘కోటి రూపాయిల’ పాట అనే పిలిచేవారు. అభిమానులు తెరపై డబ్బులు విసిరే ట్రెండ్ ఈ పాటతోనే మొదలైయింది. కానీ ఆ పాట రచయితగా విమర్శ ఎదుర్కొనే పరిస్థితి వేటూరికి పట్టింది.
కానీ ఇప్పుడు పాటల రచయితలు చాలా లక్కీ. సినిమా పాట సాహిత్యం విషయంలో ఎవరూ పెద్దగా కంప్లయింట్లు చేయడం లేదు. ఏం రాసిన.. పాటలో లిరిక్స్ వినిపించకుండా సంగీత దర్శకులు జాగ్రత్తపడుతున్నారు. అది వేరే సంగతి. బోల్డ్ కి వల్గారిటీకి, మాస్ కి బూతుకి మధ్యవున్న గీతని చేరిపేస్తూ సాహిత్యం రాసినా ఎవరికీ పట్టడం లేదు. తాజాగా మహేష్ బాబు ‘గుంటూరు కారం’ నుంచి వచ్చిన కుర్చీ మడత పాటే తీసుకుందాం. ఈ కుర్చీ మడత అనే మాట తర్వాత ఎంతటి వల్గర్ సెన్స్ వస్తుందో అందరికీ తెలుసు. కుర్చీమడత హుక్ లైన్ లో ఓ పాపులర్ డిజే బిట్ నుంచి తీసుకున్నారు. అది వేరే సంగతి. రామజోగయ్య శాస్త్రి రాసిన పాటలోకి వెళితే కూడా లెక్కలు మించి ద్వందార్ధాలు, వల్గారిటీ కనిపిస్తాయి. కానీ వినీవిన్నట్టుగా వదిలేస్తున్నారు శ్రోతలు. ఎందికిలా?! ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. అంటేనే బూతని చెవులు కొరుక్కున్న జనం.. ఇప్పుడు కూర్చిమడత పెట్టే వల్గారిటీ వినిపిస్తున్న లైట్ తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నె జనరేషన్ మార్పు అనుకోవాలేమో. ఏదేమైనా.. త్రివిక్రమ్ స్టయిల్ లోనే చెప్పాలంటే.. ఆ జనరేషన్ లో రాయడం వేటూరి దురదృష్టం… ఈ జనరేషన్ లో రాయడం రామజోగయ్య అదృష్టం.