హైదరాబాద్: నెట్ న్యూట్రాలిటీకోసం సోషల్ మీడియాలో నెటిజన్లు చేసిన ఉద్యమాలు ఎట్టకేలకు సత్ఫలితాన్ని ఇచ్చాయి. నెటిజన్ల తీవ్ర నిరసన గళానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గాల్సి రానుంది. నెట్ న్యూట్రాలిటీపై కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ నియమించిన కమిటీ ఇవాళ తన నివేదికను బహిర్గతం చేసింది. నెట్ న్యూట్రాలిటీని కమిటీ తన నివేదికలో బలంగా సమర్థించింది. ఫేస్బుక్, వాట్సప్ వంటి ఓటీటీ(ఓవర్ ది టాప్) సేవలకు రుసుములు వసూలు చేయకూడదని ఖచ్చితంగా సూచించింది. టెలికాం కంపెనీలు నెట్ న్యూట్రాలిటీకి కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది.
నెట్ న్యూట్రాలిటీకోసం దేశవ్యాప్తంగా పది లక్షలమందికిపైగా నెటిజన్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్)కి ఈమెయిల్స్, పోస్టులద్వారా సందేశాలు పంపారు. ఇంటర్నెట్ను నిర్దిష్టమైన వెబ్సైట్లకో లేదా యాప్స్కో పరిమితం చేసే టెలికాం సంస్థల ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అనూహ్యస్థాయిలో ప్రజలనుంచి వెల్లువెత్తిన ఈ స్పందనకు ప్రభుత్వమూ, టెలికాం సంస్థలూ నివ్వెరపోయాయి. దీనితో ప్రభుత్వం స్పందించి నెట్ న్యూట్రాలిటీపై ఏకే భార్గవ నేతృత్వంలో కమిటీ వేసింది.