వారసత్వాన్ని నిలుపుకోవడంలో కన్నడిగులు, తమిళులను మించిన వారు లేరు. ఈ మాట ఏదో యధాలాపంగా చెబుతున్నది కాదు. సునిశిత పరిశీలనతో చెబుతున్నది. బెంగళూరులో విద్యార్థి భవన్ అన్నా.. విజయవాడలో బాబాయ్ హొటల్ అన్నా.. ఠక్కున నోరూరుతుంది. ఆ రెండింటికీ ఉన్న పేరు అలాంటిది మరి. ప్రఖ్యాత సినీ నటుడు రాజకుమార్ చదువుకుంటున్న సమయంలో విద్యార్థి భవన్లోనే ఉండేవారు. అక్కడే చదువు పూర్తి చేసుకున్నారు. విద్యార్థి భవన్ దోశెలకు ప్రసిద్ధి. సగ్గుబియ్యంతో చేసే మసాలా దోశెకోసం బెంగళూరువాసులు బారులు తీరతారు. మెజిస్టిక్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఈ హోటల్ ఉదయం 8గంటలైతే కిటకిటలాడిపోతుంది. లోపల కూర్చోడానికి స్థలముండదు. దోశెలు వేసేవారికి ఖాళీ ఉండదు. వారు వేస్తూనే ఉంటారు. తినే వారు తింటూనే ఉంటారు. ఒకేసారి 50 దోశెల ప్లేట్లను పట్టుకుని సర్వర్ నడుస్తాడంటే అదెంత ప్రాచుర్యం పొందిందో ఊహించుకోవచ్చు. 1943లో ప్రారంభమైన ఈ విద్యార్థి భవన్ తన పేరును నిలబెట్టుకుంటూ ఆహారప్రియులకు రుచికరమైన దోశెలను అందిస్తూ తన ప్రతిష్టను నిలబెట్టుకుంటోంది. బెంగళూరు అనగానే విద్యార్థి భవన్ అనే పేరు ఠక్కున గుర్తొచ్చేలా మారిపోయింది. కన్నడనాట మరో అద్బుతమైన అల్పాహారం తవ్వ ఇడ్లీ. రెండు అరచేతుల వెడల్పునుండే ఈ ఇడ్లీని కూడా కన్నడిగులు తమకు ప్రతిష్టగా భావిస్తారు. అలాగే దాన్ని కాపాడుకుంటున్నారు కూడా.
ఇక బాబాయ్ హొటల్… రుచికరమైన ఇడ్లీకి ప్రశస్తి. ఇడ్లీలపై నెయ్యి వేసి, కారప్పొడి జల్లి.. ఇంత వెన్న ఉంచి అందించడం బాబాయ్ అలవాటు. వేడివేడిగా అందించే ఆ ఇడ్లీలు నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయేవి. స్వర్గానికి అంగుళం దూరంలో నిలబెట్టేవి. ఉప్మా పెసరట్టు మరో రుచికరమైన అల్పాహారం. విజయవాడ వచ్చిన వారెవరైనా బాబాయ్ హొటల్కు వచ్చి, ఇడ్లీ, పెసరట్ తినకుండా బయటకు వెళ్ళరు. సినిమా, రేడియో కళాకారులకు బాబాయ్ హొటల్ ఒక చర్చా వేదిక. జంధ్యాలగారైతే ఏకంగా బాబాయ్ హొటల్ పేరు మీద సినిమా కూడా తీశారు. సాలూరి రాజేశ్వర రావు, ఘంటసాల మాస్టారు, జంధ్యాల, వాసూరావు, మాధవపెద్ది సురేష్, ఇలా ఎందరో సినీ ప్రముఖులు బాబాయ్ ఇడ్లీ తిన్న వారే. ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న బాబాయ్ హొటల్ తన వారసత్వాన్ని ధీటుగా నిలబెట్టుకోలేకపోతోంది. ఇడ్లీలో వేడి తగ్గలేదు కానీ.. కరిగే గుణం మాయమైంది. బాబాయ్ ఆప్యాయత ఒలోపించింది. విద్యార్థి భవన్లో ఆప్యాయత స్థానాన్ని రుచి ఆక్రమించేసింది. బాబాయ్ హోటల్లో ఆప్యాయత, రుచి రెండూ కనుమరుగయ్యాయి. బెంగళూరుకు విద్యార్థి భవన్, విజయవాడకు బాబాయ్ హొటల్ ఐకాన్లు. హైదరాబాద్లో అసెంబ్లీ భవనం తెలియదంటారేమో కానీ, ఈ రెండు తెలియని రెండు రాష్ట్రాల ప్రజలు చెప్పరు.. చెప్పలేరు. ఎందుకంటే అవి వారి జీవితాల్లో అంత పెనవేసుకుపోయాయి. పేరు సంపాదించడం గొప్పే.. దాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో రెండింటినీ తాజాగా చూసిన నాకు బోధపడింది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి