రేటింగ్: 1.5
కొన్ని కథలు చదవడానికి బాగుంటాయి. కొన్ని చూడ్డానికి బాగుంటాయి. చదివిన ప్రతీ కథనీ తెరపైకి తీసుకురాకూడదు. ఎందుకంటే సినిమా వేరు. దాని గ్లామర్ వేరు. అందులోంచి ప్రేక్షకులు ఆశించేది, ప్రేక్షకుడికి ఇవ్వాల్సింది వేరు. ఇది తెలుసుకుని మసులుకోవాల్సిన బాధ్యత దర్శకుడిదే. ‘కాశి’లో చెప్పిన కథ.. పుస్తకంగా మలిస్తే.. చదివిన పాఠకుడికో కొత్త అనుభూతి వస్తుందేమో. దాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దాంతో గ్లామర్ దెబ్బతింది. పాఠకుడికి దక్కే అనుభూతి… ప్రేక్షకుడికి దక్కకుండా పోయింది. మరి తప్పు ఎక్కడ జరిగినట్టు? కాశి… కహానీలో లోటుపాట్లు ఏమై ఉండొచ్చు..?
కథ
భరత్ (విజయ్ ఆంటోనీ) అమెరికాలోని ఓ బడా డాక్టర్. బోలెడంత సంపాదన. ఖరీదైన ఇల్లు. ప్రేమించే అమ్మానాన్న. ఇంతకంటే ఏం కావాలి? కానీ భరత్ లో ఏదో అలజడి. ప్రతీ రోజూ అతన్ని ఓ కల వెంటాడుతుంటుంది. దానికి కారణం తెలీదు. అయితే ఓ రోజు… తన తల్లిదండ్రుల గురించి భరత్‌కి ఓ నిజం తెలుస్తుంది. తనో దత్త పుత్రుడ్ని అని, తనని కన్న తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నారని అర్థమవుతుంది. తన కలకీ, తన ఫ్లాష్ బ్యాక్కీ, తల్లిదండ్రులకూ ఏదో లింకు ఉన్నదని అర్థమవుతుంది. అదేంటో తెలుసుకుందామని భరత్ ఇండియా వస్తాడు. ఇక్కడకు వచ్చి కాశిగా మారతాడు. భరత్ అనబడే కాశికి ఇండియాలో తన పుట్టుక గురించి తెలిసిన నిజాలేంటి? కాశి తల్లిదండ్రులు ఎవరు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
ఓ కొడుకు తన తల్లిదండ్రుల గురించి చేసే ప్రయాణం ‘కాశి’. మధ్యమధ్యలో ఎదురైన పాత్రలు, వాటి ద్వారా తెలిసిన కథలు కలగలిపిన సినిమా ఇది. పాయింటు బాగుంది. దాన్ని పుస్తకంగా రాస్తే ఇంకా బాగుంటుంది. కానీ.. తెరపై తీసుకురావడంలోనే ఇబ్బందంతా. కాశికి ఎదురైన ప్రెసిడెంటు, దొంగ, చర్చి ఫాదర్ ఒకొక్క కథ చెబుతారు. ఒక్కో కథకూ దాదాపు అరగంట కేటాయించాడు దర్శకుడు. ప్రెసిడెంటు కథకూ, దొంగ కథకూ అసలు కథతో ఏమాత్రం సంబంధం ఉండదు. దాంతో ఈ కథల్ని దర్శకురాలు ఇక్కడ ఎందుకు చెప్పాల్సివచ్చినట్టు అనిపిస్తుంది. చివర్లో చర్చ్ ఫాదర్ కథతో మాత్రమే ‘కాశి’ కథకు లింకు ఉంటుంది. అంటే.. దర్శకురాలు ఉప కథల ద్వారానే గంట సమయం తినేశాడన్నమాట. కాశికి ఎదురైన కథలకూ.. తన పుట్టు పూర్వోత్తరాలకూ అంతర్లీనంగా ఏమైనా లింకు ఉన్నట్టు చూపిస్తే గనుక.. కాశి ఓ గొప్ప ప్రయత్నంగా మిలుగుదును. అలా చూపించాలంటే కథలో పట్టుండాలి. కథనంలో మ్యాజిక్ ఉండాలి. అవి రెండూ ‘కాశి’లో కనిపించవు. ఇంత చిన్న కథని సినిమా తీయడానికి విజయ్ ఆంటోనీ ఎలా ఒప్పుకున్నాడా? అనిపిస్తుంది.
అవ్ ఆజ్ కల్ సినిమా గుర్తుంది కదా? అందులో ఫ్లాష్ బ్యాక్‌లో రావల్సిన పాత్రలో హీరో కనిపిపిస్తుంటాడు. అలా ప్రెసిడెంటు కథలో, దొంగ కథలో, చర్చి ఫాదర్ కథలో.. విజయ్ ఆంటోనీనే నాయకుడు. ఒకే సినిమాలో మూడు పాత్రలు చేసే అవకాశం వచ్చిందని విజయ్ ఈ కథకు ఒకే చెప్పి ఉంటాడు. కానీ ఆయా పాత్రల్లో వైవిధ్యం లేకపోవడం, కథతో అస్సలు సంబంధమే లేకపోవడంతో ఈ ప్రయత్నం బెడసి కొట్టింది. కాంపోండర్ సహాయంతో… కొన్ని జోకులు పేల్చడానికి, కొన్ని సెటైర్లు వేయడానికీ ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు కూడా అక్కడక్కడ మాత్రమే పండాయి. సినిమాలో అరవై సీన్లు ఉంటే, అందులో నలభై అసలు కథతో లింకు తెగిపోయి ఉంటాయి. అలాంటి కథ ఎలా రాణిస్తుందనుకున్నారో, ఏంటో? పతాక సన్నివేశాల్లో ఏదో భయంకరమైన ట్విస్టు ఉంటుందిలే అనుకుంటే… అది కూడా చప్పగా సాగింది. ‘ఈ మాత్రం దానికి అమెరికా నుంచి ఇండియా రావాలా’ అనేలా తయారు చేశారు క్లైమాక్స్‌ని.
నటీనటులు
కెరీర్ మొదటి నుంచి ఇప్పటి వరకూ ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్తో నడిపించుకొస్తున్నాడు విజయ్ ఆంటోనీ. కొన్ని పాత్రలకు అది వర్కవుట్ అయ్యింది. కానీ ప్రతీసారీ అదే మొహం, అదే ఎక్స్ప్రెషన్ అంటే ఎలా..?? విజయ్ మూడు గెటప్పుల్లో కనిపించినా.. ప్రతీ గెటప్పుకీ ఒకే నటన. ఇదే కొనసాగుతూ పోతే.. కొన్నాళ్లకు విజయ్ అంటేనే బోర్ కొట్టేస్తుంది. ‘ఈ సినిమాలో నువ్వే హీరోయిన్‌వి’ అంటే.. గబుక్కున అంజలి ఒప్పేసుకుని ఉంటుంది. కానీ.. ఆమె పాత్రకు అంత సీన్ లేదు. కామెడీ పాత్ర చేసిన కంపోండర్ కంటే.. అంజలి పాత్రకున్న లెంగ్త్ తక్కువ. తెలుగులోనూ సినిమాని అమ్ముకుందాం అనుకున్న విజయ్.. కొంతమంది తెలుగు నటుల్నీ తీసుకుంటే బాగుంటుంది. కానీ ఆ ప్రయత్నం ఇందులో జరగలేదు. కాబట్టి తమిళ సినిమా చూస్తున్న ఫీలింగ్ అడుగడుగునా కనిపిస్తుంది.
సాంకేతిక వర్గం
కథ, కథనాలు పేలవంగా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? పాటలు బాగోలేవు. వచ్చిన ప్రతీ పాటా కథకు అడ్డు తగులుతూనే ఉంటుంది. నిడివి తక్కువే అయినా పెద్ద సినిమా చూస్తున్నఫీలింగ్ వస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టొచ్చు. ఫ్లాష్ బ్యాక్‌లో ఫ్లాష్ బ్యాక్ రావడం కథనంలో లోపం. అలాంటి లోపాలు ఈ సినిమాలో చాలా కనిపిస్తాయి.
తీర్పు
‘బిచ్చగాడు’ అనే ఒకే ఒక్క సినిమాతో విజయ్ ఆంటోనీ పాపులర్ అయిపోయాడు. ఆ సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డాడో, అంతకు ముందు ఎంత శ్రమించాడో తెలీదు గానీ, ఇప్పుడు మాత్రం రిలాక్స్ అయిపోయాడనిపిస్తోంది. కథ, కథనాల్లో లోపాలు, ఎక్స్ప్రెషన్స్ లేని నటన, మితిమీరిన తమిళ వాసన.. విజయ్ చిత్రాలకు శాపంగా మారుతుంది. అందులోంచి విజయ్ మరింత కూరుకుపోయాడని చెప్పడానికి ‘కాశి’ ఓ ఉదాహరణగా నిలుస్తుంది.
ఫినిషింగ్ టచ్: ‘నాన్నారింటికి దారేది’
రేటింగ్: 1.5