విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీస్ బ్యానర్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకుడు. ఇదో పిరియాడికల్ యాక్షన్ డ్రామా. విజయ్ దేవరకొండ పుట్టిన రోజున ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ కథ సూర్య, కార్తి దగ్గరకు వెళ్లిందట. వారిద్దరూ తండ్రీ కొడుకులుగా చేయాల్సిన సినిమా ఇది. కథ కూడా వారిద్దరికీ నచ్చింది. కానీ.. రకరకాల కారణాల వల్ల, `నో` చెప్పారని సమాచారం. ఇప్పుడు అదే కథ విజయ్ దగ్గరకు చేరింది. అయితే ఈసారి తండ్రీ కొడుకులుగా రెండు పాత్రలూ విజయ్ నే పోషించనుండడం విశేషం. అయితే సూర్య, కార్తిల ఇమేజ్ వేరు, విజయ్ ఇమేజ్ వేరు. దానికి తగ్గట్టే రాహుల్ కూడా కథలో కొన్ని కీలకమైన మార్పులు చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక ఫిక్సయింది. విజయ్ – రష్మికల కాంబోలో రూపుదిద్దుకొంటున్న 3వ చిత్రమిది. గౌతమ్ తిన్ననూరి సినిమా పూర్తయిన వెంటనే… రాహుల్ సంకృత్యన్ పిరియాడికల్ డ్రామా సెట్స్ పైకి వెళ్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.