లైగర్ సినిమా తన జీవితం మొత్తం తీసుకుందని ప్రమోషనల్లో ఎమోషన్ అయిన విజయ్ దేవరకొండకు.. ఆ సినిమా వల్ల అనుకున్న ఫలితం రాకపోగా.. ఆ తర్వాత కూడా చిక్కులు వెంటాడుతున్నాయి. లైగర్ సినిమా పెట్టుబడుల్లో తెలంగాణకు చెందిన ఓ కీలక నేత బ్లాక్ మనీ పెట్టుబడిగా ఉందన్న సమాచారం అందడంతో ఈడీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. విజయ్ దేవరకొండను ఈ కేసులో పిలిపించారు. ఆయన హైదరాబాద్లోని ఈడీ ఆఫీసుకు ఉదయమే హాజరయ్యారు. సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ సినిమా నిర్మాతలయిన చార్మి, పూరి జగన్నాథ్లను ఇటీవలే ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు ఆ సినిమాలో హీరో అయిన విజయ్ దేవరకొండను ప్రశ్నించారు. మొదట చిన్న సినిమాగా ప్రారంభించినా.. రాను రాను మూవీ బడ్జెట్ వందల కోట్లకు చేరింది. అదే సమయంలో సినిమా రేంజ్ కూడా పాన్ ఇండియాకు వెళ్లింది. ఆ స్థాయిలో రికవరీ రాలేదు. ఆ వివాదం అలా ఉండగా.. ఇప్పుడు అసలు సినిమాకు పెట్టుబడులు ఎక్కడి నుంచన్నదానిపై ఈడీ కూపీలాగుతోంది.
టీఆర్ఎస్ ముఖ్య నేతలతో విజయ్ దేవరకొండకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలతోనే పెట్టుబడులు పెట్టారని… గతంలో కాంగ్రెస్ నేత ఒకరు సీబీఐ , ఐటీ, ఈడీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారా లేక… ఇంకేదైనా ఆధారాలున్నాయా అన్నదానిపై స్పష్టత లేదు. తెలంగాణ ప్రభుత్వ పెద్దల్లోని ముఖ్యుల రహస్య ఆర్థిక లావాదేవీలను వెలికి తీయాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలు.. విచారణ లోతుగా జరుపుతూండటంతో .. రాజకీయవర్గాల్లోనూ టెన్షన్ ప్రారంభమయింది.