తమిళనాట స్టార్ హీరో జోసఫ్ విజయ్ కొత్త పార్టీని ప్రకటించారు. తమిళనాట ప్రజల భావజాలానికి తగ్గట్లుగా ఆయనది కూడా… పూర్తి స్థాయిలో బీజేపీ వ్యతిరేక భావజాలం. ఆయన ఏ మార్గంలో వెళ్తారు.. ఆయన విధానాలేమిటి… అన్న విషయాలపై పెద్దగా స్పష్టత లేదు. అయితే ఆయనకు రాజకీయంగా ఎంత అవకాశం ఉన్నది.. కమల్ హాసన్ లాంటి యాక్టరే అసలు ప్రభావం చూపించలేని ఎన్నికల్లో విజయ్ ఎంత మేర ప్రభావం చూపిస్తారన్నది ఇక్కడ కీలకంగా మారింది.
స్టాలిన్‌కు ప్రత్యర్థి లేని తమిళనాడు రాజకీయాలు
ఇద్దరు దిగ్గజ నేతలు ఒకరి తర్వాత చనిపోవడంతో తమిళనాడులో పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది. దశాబ్దాల పాటు అయితే జయలలిత లేకపోతే కరుణానిధి అన్నట్లుగా రాజకీయం నడిచింది. వీరి మధ్యలో ఎవరు వచ్చిన నలిగిపోవాల్సింది. ఇప్పుడు తమిళనాడు వారు లేని రాజకీయం చూస్తోంది. జయలలితకు వారసులు లేకపోవడం ..,. ఆమె వారసత్వాన్ని అందుకోవాల్సిన శశికళ జైలుకెళ్లి నీరసపడిపోవడంతో అన్నాడీఎంకే పార్టీ భవిష్యత్ పై బెంగ ప్రారంభమయింది. అయితే కరుణానిధికి వారసుడిగా స్టాలిన్ ఉండటంతో డీఎంకేకు సమస్యల్లేవు. ఇప్పుడు స్టాలిన్ కు ప్రత్యర్థి లేకపోవడం వల్ల డీఎంకేకు ఎదురు లేకుండా పోతోంది.
విజయ్ కు స్టాలిన్ ను ఢీకొట్టే సత్తా ఉందా ?
స్టాలిన్ కు ఉన్న ఇమేజ్ కు తగ్గట్లుగా ఓ నేత ఆయనకు పోటీ ఉంటే తప్ప.. డీఎంకేకు తిరుగు ఉండదు. పన్నీర్ సెల్వం, పళని స్వామి తేలిపోయారు. కమల్ హాసన్ ను ప్రజలు పట్టించుకోలేదు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైకి బయటే పబ్లిసిటీ వస్తోంది. తమిళనాడులో ఆయన ఇమేజ్ పెరగడం లేదు. ఇలాంటి సమయంలో జోసఫ్ విజయ్ రంగంలోకి దిగుతున్నారు., ప్రజలు… ఆయనను స్టాలిన్ కు పోటీగా భావిస్తేనే ఆయన పార్టీ రేసులో ఉంటుంది. లేకపోతే కమల్ హాసన్… విజయ్ కాంత్ పార్టీలా…. కొంత ఓటు బ్యాంక్ తో మిగిలిపోతుంది.
సినీ యాక్టర్లను తమిళనాట కూడా ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు !
విజయ్ ఓ సినిమా స్టార్. ఆయనకు ఎంత ఆదరణ ఉందో అంత మేర వ్యతిరేకత కూడా ఉంటుంది. పైగా తమిళనాట కూడా.. సినీ తారల్ని రాజకీయ నేతలుగా ఆరాధించే సంస్కృతి తగ్గిపోయింది. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి సినీ రంగం నుంచే వచ్చినా రాజకీయంగా వారితో బలమైన భావజాలం . సినీ ముద్ర లేకుండా… రాజకీయం చేశారు. విజయ్ అలా చేయగలరా అన్నదే కీలకం. సినీ చరిష్మా ఆయనకు పబ్లిసిటీ మాత్రమే తెస్తుంది కానీ ఓట్లు కాదు. ఆయన రాజకీయాన్ని బట్టే రాజకీయ జీవితం ఉంటుంది.