తమిళనాడు రాజకీయాల్ని, సినిమాల్నీ వేరే చేసి చూడలేం. అక్కడ స్టార్లుగా ఎదిగిన వాళ్లంతా ఏదో ఓ దశలో రాజకీయ అరంగేట్రం చేసిన వాళ్లే. ఇప్పుడు విజయ్ వంతు వచ్చింది. విజయ్ రాజకీయ అరంగేట్రం గురించి ఎన్నాళ్ల నుంచో ప్రచారం జరుగుతోంది. అభిమానుల ఆశలు, అంచనాలకు తగ్గట్టుగానే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తానని ఇది వరకే ప్రకటించారు. ఇప్పుడు పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఈ రోజు ఉదయం చెన్నైలోని తన కార్యాలయంలో తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాని ఎగరేశారు. ఎరుపు, పసుపు రంగుళ మేళవింపుతో ఈ పార్టీ జెండాని రూపొందించారు. మధ్యలో రెండు ఏనుగులతో పాటు వాగాయ్ అనే జాతి పువ్వు ఉంది. ఈ పుష్షాలను విజయానికి ప్రతీకగా భావిస్తారు తమిళ ప్రజలు. ‘పుట్టుకతో అందరూ సమానమే’ అనే అర్థం వచ్చేలా తమిళ క్యాప్షన్‌ని పార్టీ నినాదం లా ప్రకటించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేయబోతోంది. గత ఎన్నికలకు ముందే పార్టీ ప్రకటించినా, పోటీ చేయలేదు విజయ్. అలాగని ఎవరికీ మద్దతు కూడా ప్రకటించలేదు. గెలిచినా, ఓడినా ఒంటరి ప్రయాణమే అని, తన అభిమానులు ఏ పార్టీ జెండానీ భుజాన మోయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు విజయ్. సామాజిక న్యాయమే తన లక్ష్యమని, తమిళనాడు అభివృద్ది కోసం కలసికట్టుగా పోరాటం చేద్దామని ఈ సందర్భంగా విజయ్ పిలుపునిచ్చారు. త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేస్తానని, అందులో పూర్తి వివరాలు ప్రకటిస్తానని విజయ్ చెప్పారు. విజయ్ నటించిన ‘గోట్’ విడుదలకు సిద్ధంగా ఉంది. పొలిటికల్ ఎంట్రీకి ముందు విజయ్ చేస్తున్న సినిమా ఇది. ఆ తరవాత విజయ్ సినిమాలకు దూరం అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.