‘అతడు’ సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకొంటుంటారు. మన హీరోల్లోనూ ఈ సినిమాకు వీరాభిమానులున్నారు. మన హీరోలు ‘అతడు’ని అభిమానించడం మామూలే. ఓ తమిళ హీరో ఈ సినిమాకు వీరాభిమాని. తనే… విజయ్ సేతుపతి. ‘అతడు’ సినిమాని లెక్కలేనన్నిసార్లు చూశాడట. తనలో నిరాశ, నిస్పృహ ఎప్పుడు ఆవహించినా ఈ సినిమా చూస్తుంటానని, చూసినప్పుడల్లా ఈ సినిమా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, స్ఫూర్తిని రగిలిస్తుందని చెబుతున్నాడు విజయ్‌సేతుపతి.
”నేను మానసికంగా కాస్త ఇబ్బంది పడుతున్నప్పుడు ‘అతడు’ సినిమా చూస్తుంటాను. వెంటనే కావల్సినంత ఎనర్జీ వచ్చేస్తుంటుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ వరకూ కదలనివ్వకుండా చేసే సినిమా ఇది. అన్నిరకాల భావోద్వేగాల్ని త్రివిక్రమ్ బాగా చూపించారు. మహేష్ – త్రిష జోడీ, బ్రహ్మానందం పంచే వినోదం నాకు బాగా నచ్చాయి. నేను రిపీట్ మోడ్ లో చూసిన సినిమాల్లో ఇదొకటి” అంటూ ‘అతడు’ చిత్రానికి కితాబు ఇచ్చాడు విజయ్ సేతుపతి. ఇటీవల తను నటించిన ‘మహారాజా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీసు దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొంది. విజయ్ ది బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఓటీటీలో విడుదలైన తరవాత మరింత మంచి స్పందన వస్తోంది. తెలుగులో ఉప్పెన తరవాత అంతటి బలమైన పాత్ర విజయ్‌కు పడలేదు. అలాంటి పాత్ర కోసమే తాను ఎదురు చూస్తున్నానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు విజయ్. ”ఉప్పెన లాంటి కథలు ఎప్పుడో గాని పుట్టవు. అందులోని ప్రతీ పాత్ర కీలకమే. అలాంటి కథలు వచ్చినప్పుడే నాలోని నటుడికి సంతృప్తి. నేను కూడా ఆ తరహా కథల కోసం ఎదురు చూస్తున్నా” అంటున్నాడు ఈ వెర్సటైల్ యాక్టర్. మరి అలాంటి సినిమా విజయ్‌కు మళ్లీ ఎప్పుడు దొరుకుతుందో..?!