సౌత్ ఇండియాలో విజయ్‌సేతుపతి పెద్ద స్టార్. ఉప్పెనతో.. నేరుగా టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చాడు. సైరాలో ఓ కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఆ తరవాత తెలుగులో ఏ సినిమాలోనూ నటించలేదు. నిజానికి.. విజయ్ సేతుపతి కోసం పాత్రలు సిద్ధమైనా, విజయ్ సేతుపతి అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నా సరే – విజయ్ ఆటిట్యూడ్ తో చాలా సినిమాలు తనకు అందకుండా పోయాయని టాక్. `విజయ్ సేతుపతి` పేరు ఎత్తగానే.. చాలామంది దర్శకులు నిర్మాతలు.. `వామ్మో..ఆయనెందుకు` అంటూ తప్పుకుంటున్నార్ట. విజయ్ తో వ్యవహారం అలా వుంది మరి.
ఈమధ్య ఓ నిర్మాత విజయ్ సేతుపతి డేట్ల కోసం తెగ ప్రయత్నించాడు. చివరికి అప్పాయింట్మెంట్ కూడా దొరికేసింది. విజయ్ కి కథ నచ్చేసింది. అక్కడి నుంచి కండీషన్లు మొదలయ్యాయి. విజయ్ పారితోషికం.. రోజుల లెక్కన ఇవ్వాలట. రోజుకి తను ఆఫర్ చేసింది ఎంతో తెలుసా? ఏకంగా కోటి రూపాయలు. అంతే కాదు… సినిమా ప్రమోషన్లకు రానని ఖరాఖండీగా చెప్పేశాడట. ఒకవేళ ప్రమోషన్లకు వచ్చేలా ఉంటే.. రోజుకి రూ.75 లక్షలు ఛార్జ్ వసూలు చేస్తానన్నాడట. అక్కడితో ఆగలేదు. ఆ సినిమాని తమిళంలో డబ్ చేయకూడదని షరతు పెట్టాడట. ఇవన్నీ విని నిర్మాత ఎందుకు ఊరుకుంటాడు? అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు.
చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు స్టార్ అయిపోయాడు. ఓ సినిమా ఒప్పుకున్నారంటే, ఆ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం నటీనటులు, సాంకేతిక నిపుణుల బాధ్యత. దానికి కూడా డబ్బులు అడగడం.. కచ్చితంగా సినిమాలకు చేస్తున్న ద్రోహమే. తమిళంలో విజయ్ కి మార్కెట్ ఉంది. దాని ద్వారా ఎంతో కొంత డబ్బులు వెనక్కి రాబట్టుకోవాలన్నది నిర్మాతల ఆలోచన. అందుకే విజయ్ ఎంత అడిగినా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అలాంటప్పుడు తమిళంలో సినిఆమని విడుదల చేయకూడదని చెప్పడం భావ్యం కాదు. అందుకే తెలుగులో విజయ్‌సేతుపతిని తీసుకోవడానికి నిర్మాతలు జంకుతున్నారు.