వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించినప్పటికీ ఇంకా చాలా మంది ఖాళీగానే ఉన్నారు. ప్రభుత్వం వచ్చినా మాకేమీ ఉపయోగం లేదని బాధపడుతున్న వారు పెరిగిపోతున్నారు. దీంతో విజయసాయిరెడ్డి జాబ్ మేళాలు ప్లాన్ చేశారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో శనివారం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాల్లో 147 కంపెనీలు పాల్గొంటున్నాయని వేల మందికి ఉద్యోగాలివ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ కంపెనీలు ఏమిటి.. ఎలాంటి ఉద్యోగాలిస్తారు.. అన్నదానిపై స్పష్టత లేదు. కానీ గతంలో కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇవి ఏర్పాటు చేస్తున్నారు.
చాలా రోజుల నుంచి జాబ్ మేళాల గురించి విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు.. విశాఖ ఫార్మాసిటీలో ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత శ్రీకాకుళంలోనూ… అలాంటి మాటే చెప్పారు. స్థానిక ఎన్నికలకు ముందే కార్యకర్తలకు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. ఇప్పుడు జాబ్ మేళాలు పెడుతున్నారు. అవి కూడా ప్రైవేటు కంపెనీలు. ఇచ్చేది కూడా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఎక్కువ.
ఉద్యోగాలు చేయాలనుకుంటే.. వారందరూ ఎప్పుడో సీరియస్గా ప్రయత్నించి ఉద్యోగాలు చేసుకునేవారని.. వైసీపీ కోసమే వారు ఆ ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేశారని.. రాజకీయంగా వారు ప్రాధాన్యత కోరుకుంటున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి. అయితే విజయసాయిరెడ్డి మాత్రం.. వారి అసంతృప్తి ఉద్యోగాల కోసమేనన్నట్లుగా ఉన్నారు.. ఎంత మందికి ఉద్యోగాలిప్పిస్తారో వచ్చే రెండు, మూడు రోజుల్లో తేలనుంది.