‘కేసీఆర్ వ్యతిరేకులను ఏకం చేయడం’ అనే మిషన్ తో కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య జోరుగా పావులు కదుపుతోంది. కొన్నేళ్లుగా పార్టీలో ఉంటూ అకలబూనిన నేతల్నీ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నవారినీ మళ్లీ బుజ్జగించే పనిలో పడ్డట్టుగా ఉంది. గతంతో పోల్చితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణమే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు నాలుగేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న విజయశాంతిని మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకుని వస్తున్నారు. దీన్లో భాగంగానే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రాములమ్మ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ఉత్తమ్ తోపాటు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా కూడా హాజరయ్యారు. పార్టీ ప్రచార బాధ్యతలు ఆమెకి అప్పగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే, పదవులకు సంబంధించి ఈ భేటీలో ఎలాంటి చర్చా జరగలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా, కొన్ని డిమాండ్లతోనే విజయశాంతి ఢిల్లీకి వెళ్లారనే అభిప్రాయం అదే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
నిజానికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లో ఏదో ఒక కీలకమైన పదవిని రాములమ్మ ఆశించే అవకాశం స్పష్టంగా ఉంది. కేసీఆర్ తో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న నేతగా ఆమె చెప్పుకుంటారు కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా అదే స్థాయి ప్రాధాన్యతను ఆమె కోరుకోవడం సహజం. కొన్నాళ్లుగా ఆమెను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలంటూ ఆ పార్టీ నేతలే కోరిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే, సొంత నియోజక వర్గంలో తనపై కొంతమంది ఉద్దేశపూర్వంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నారనీ, వారిని సస్పెండ్ చేస్తేనే పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ అవుతానని గతంలో ఓ షరతు పెట్టారట! దానికి అనుగుణంగానే కొన్ని మార్పులూ చేర్పులూ జరిగాయనీ చెబుతారు. అయినాసరే, రాములమ్మ ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారనే వాదన కూడా పార్టీ వర్గాల్లో ఉంది.
వాస్తవం మాట్లాడుకుంటే… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ప్రభావంతమైన నాయకురాలిగా ఎదగాలన్న తపనా ఆకాంక్ష ఆమెలో గతంలో ఎన్నడూ కనిపించలేదనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు యాక్టివ్ అయిపోయారని చెప్పుకుంటున్నా… వాస్తవంలో పెద్దగా ప్రభావం ఉండదనే చెప్పొచ్చు. ఎందుకంటే, కొత్తతరం ఓటర్లకు ఆమె సినీ గ్లామర్ ఏంటో తెలిసే అవకాశం లేదు. ఆమె సినిమాలకు దూరమై దాదాపు దశాబ్దం దాటేసింది. ఇదే సమయంలో, ఒక నాయకురాలిగా తనదైన ముద్ర అంటూ కూడా విజయశాంతికి లేదు. చెప్పుకోవడానికి కొంత గతం మాత్రమే ఉంది. అయితే, ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది కాబట్టి, ఇప్పుట్నుంచీ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తే… ఎన్నికల నాటికి ఆమె ఆశిస్తున్న ప్రాధాన్యత పార్టీ నుంచి దక్కే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకులు పార్టీలో చేరుతున్న ఈ తరుణంలో.. పార్టీలో ముందు వరుసలో నిలవాలంటే రాములమ్మ చాలా కష్టపడాల్సి ఉంటుందనే చెప్పాలి.